Software job for disabled young man in Amazon: పుట్టుకతో వంకర్లు తిరిగిన చేతులు, కాళ్లు. శరీరం మొత్తం ఒకేచోట. అదీనూ అడుగు తీసి అడుగేయలేని స్థితి. మంచం మీద నుంచి కదల్లేని దీనస్థితి. తల, రెండు చేతుల్లోని చూపుడు వేళ్లు మాత్రమే పనిచేస్తాయి ఈ యువకుడికి. కాళ్లు, చేతులు కదపాలన్నా... మరొకరి సాయం కావాల్సిందే. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ నిండైన ఆత్మవిశ్వాసంతో లక్ష్యం దిశగా అడుగులేసి అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ కొలువు సాధించాడు.
విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన యువకుడి పేరు అమృత్. మొదటి సంతానంలో కుమారుడు జన్మించడం పట్ల యువకుడి తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఏడాది వరకు బాలుడి బుడిబుడి అడుగులు చూసి మురిసిపోయారు. ఐదేళ్లు గడిచినా నడకలో తడబాటు, ఎదుగుదలలో లోపం కనిపించడంతో వైద్యులను సంప్రదించారు. లక్షలు ఖర్చు చేశారు. ఎక్కడికెళ్లినా అమృత్ ఎదుగుదలలో ఫలితం లేకుండా పోయింది.
తొలి సంతానంగా జన్మించిన పిల్లవాడి పరిస్థితిని చూసి అమృత్ తల్లిదండ్రులు కన్నీరు- మున్నీరయ్యారు. దీనికి తోడు బాలుడిని చూసి..అయ్యో...అతడి స్థితి జీవితాంతం అంతే అన్న ఇరుగుపొరుగు వారి మాటలు ఆ తల్లిదండ్రులను మరింత కుంగదీశాయి. దాని నుంచి కోలుకున్న అమ్మానాన్నలు అమృత్‌ను ఎలాగైనా ప్రయోజకుడిని చేయాలని నిశ్చయించుకున్నారు. నాటి వారి సంకల్ప ఫలితంగానే సాఫ్ట్‌వేర్‌గా ఎదిగాడు అమృత్.
అవయవాలు పనిచేయని అమృత్‌కు అన్నీ తామై వ్యవహరించారు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు. స్థానికంగానే విద్యనభ్యసించిన యువకుడిని 5వ తరగతి వరకు తల్లి ఎత్తుకొని పాఠశాలకు తీసుకెళ్లేది. తర్వాత చక్రాల కుర్చీపై స్కూలుకెళ్లిన అమృత్‌కు తోటి విద్యార్థులు సాయం చేసేవారు. మధ్యాహ్న భోజనాన్ని కూడా స్నేహితురాళ్లు ధరణి, రమ్య తినిపించేవారు. ఇలాంటి పరిస్థితుల మధ్య చదువుకున్న అమృత్ పదిలో 9.1 పాయింట్లు సాధించి మేటిగా నిలిచాడు.