విజయనగరం పర్యటనలో భాగంగా.. డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీస్ కార్యాలయానికి వెళ్లి.. లాక్ డౌన్ అమలు తీరుపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్-19 వైరస్ను నివారించడంలో విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ.. ఒక ఉద్యోగిలా కాకుండా పోలీసులు ప్రజలకు సేవ చేసే సంస్థల్లాగా ఉండాలని సూచించారు.
కరోనాను నియత్రించేందుకు ప్రతి ఒక్క పోలీస్ అంకితభావంతో పనిచేశారని.. ఇకముందు అలాగే ఉంటూ ప్రజలు క్షేమంగా ఉండేలా చూడాలని ఆకాంక్షించారు. వలసదారుల రాకతో జిల్లాలో 4 కరోనా కేసులు నమోదైనప్పటికీ.. వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో జిల్లా పోలీస్ శాఖ విజయవంతమైందని ప్రశంసించారు.