ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు నమోదుకాకుండా గ్రీన్ జోన్లో నిలిచిన విజయనగరం జిల్లాకు లాక్ డౌన్ ఆంక్షలు నుంచి మినహాయింపు లభించింది. లాక్ డౌన్ సడలింపులు జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీనిలో భాగంగా ప్రజలు ఉదయం నుంచి రాత్రి 7గంటల వరకు తిరిగేందుకు అనుమతి ఇచ్చారు. అయితే., వాహనాలపై ప్రయణాలకు మాత్రం ఆంక్షలను కొనసాగించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు పూర్తిస్థాయి సడలింపు ఇచ్చారు.
ఇక., వ్యాపార కార్యకలాపాల విషయానికొస్తే., ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దుకాణాలు నిర్వహించుకునేందుకు అనుమతి లభించింది. విక్రయదారులు కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
సుమారు 40రోజుల తర్వాత వ్యాపార కార్యకలాపాలకు అనుమతి లభించటంతో జిల్లా వ్యాప్తంగా దుకాణాలన్నీ తెరుచుకున్నాయి. ఆయా ప్రాంతాలు సందడిగా మారాయి. ప్రధానంగా విజయనగరంలో ప్రధాన మార్కెట్లన్నీ తెరుచుకున్నాయి. విక్రయదారులు, కొనుగోలుదార్లతో వస్త్రాలు, బంగారు, ఎలక్ట్రికల్, ఇంటి సామాగ్రి, చెప్పుల దుకాణాలకు కొత్త కళ వచ్చినట్లుగా కనిపించింది. పలువురు వ్యాపారులు మాట్లాడుతూ.. కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వ్యాపార నష్టాలపై పెదవి విరిచారు. అయినప్పటికీ.. కొవిడ్-19 వైరస్ నియంత్రణకు తమ వంతు చర్యలు చేపడుతూ.. భవిష్యత్తుపై ఆశతో తిరిగి కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఇవీ చదవండి...'ఉన్న ఒక్క గ్రీన్ జోన్ జిల్లానూ రెడ్ జోన్ చేస్తారా!'