HOUSES DEMOLITIONS IN BHOGAPURAM : విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ముడసర్లపేట, బొల్లింకపాలెంలో నాలుగు ఇళ్లతోపాటు పాఠశాల భవనాన్ని(జేసీబీ) JCB సాయంతో తొలగించారు. గ్రామాలను వెంటనే ఖాళీ చేయాలని లేకపోతే విద్యుత్, తాగునీటి సరఫరా నిలిపివేస్తామని ఆర్డీవో సూర్యకళతోపాటు రెవెన్యూ అధికారులు హెచ్చరించారని స్థానికులు చెబుతున్నారు.
కొంతమందికి పూర్తి పరిహారం రాలేదని, ఇతర ప్రయోజనాలు అందాల్సిఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతం కూల్చిన ఇళ్లకు సంబంధించిన యజమానులు పునరావాసకాలనీల్లో ఇళ్లు నిర్మించుకున్నారని, వారి అంగీకారంతోనే కూల్చేశామని అధికారులు అంటున్నారు.
విమానాశ్రయం కోసం 2200 ఎకరాలు అవసరం కాగా ప్రభుత్వం ఇతర అవసరాల కోసం అదనంగా 500 ఎకరాలను సేకరించడంతో నాలుగు గ్రామాలను తరలించాల్సి వస్తోంది. మరడపాలెంలో 223, ముడసర్లపేటలో 33. బల్లింకపాలెంలో 55, రెల్లిపేటలో 85 కుటుంబాలు ఉన్నాయి. వీరి కోసం గూడెపువలసలో 17 ఎకరాలు, పోలిపల్లి రెవెన్యూ లింగాలవలసలో 25 ఎకరాల్లో పునరావాస కాలనీలను నిర్మిస్తున్నారు. ఇక్కడ నిర్వాసితుల ఇళ్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి.