విజయనగరం జిల్లా పార్వతీపురంలోని జిల్లా ఆస్పత్రిని డీసీహెచ్ఎస్ నాగభూషణరావు సందర్శించారు. ప్రసూతి వార్డు శస్త్ర చికిత్స విభాగం, రక్త నిధి కేంద్రం, ఫిజియోథెరపీ ఎక్స్‌రే విభాగం, అత్యవసర విభాగాలను ఆయన పరిశీలించారు.
జాతీయ స్థాయి ప్రమాణాలతో వైద్యం: డీసీహెచ్ఎస్ నాగభూషణ రావు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాతీయ స్థాయి ప్రమాణాలతో వైద్యం, శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు డీసీహెచ్ఎస్ నాగభూషణరావు తెలిపారు. పార్వతీపురం జిల్లా ఆస్పత్రి ఆయన సందర్శించారు ప్రతి విభాగంలోనూ ప్రమాణాలు పాటిస్తూ వైద్యం అందించాలని వైద్యుల కు సూచించారు.
ఇకపై ప్రసూతి శస్త్రచికిత్స విభాగాల్లో జాతీయ స్థాయి ప్రమాణాలు అమలయ్యేలా ప్రయత్నిస్తున్నామని నాగభూషణరావు తెలిపారు. అందుకు సంబంధించి వైద్యులు, స్టాఫ్ నర్స్‌లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని అన్నారు. ఎక్కడ ఏ పరికరం ఉండాలి, ఎలా వైద్యం చేయాలి.. వంటి అంశాలు అన్నింటినీ పక్కాగా అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లక్ష్యం గుర్తింపు వస్తుందన్నారు. ఆ ధ్రువ పత్రం పొందితే కేంద్రం నుంచి ఆస్పత్రులకు పుష్కలంగా నిధులు వస్తాయన్నారు. మరింత మెరుగైన వైద్య సేవలకు ఆస్కారం కలుగుతుందని ఆయన వివరించారు. జిల్లాలో 14 వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రులు సేవలందిస్తున్నాయన్నారు. వాటిలో 12 ఆసుపత్రుల హోదా పెరిగిందని, అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు. అన్నిచోట్ల ఆధునిక పరికరాల ఏర్పాటుతో పాటు నిపుణుల సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆసుపత్రుల సేవలో క్వాంటిటీ ప్రధానం కాదని.. క్వాలిటీ ముఖ్యమన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నా మన్నారు. కరోనా రెండో దశ జిల్లాలో దాదాపుగా తగ్గుముఖం పట్టిందన్నారు. అక్కడక్కడ మాత్రమే కొద్దిపాటి కేసులు వస్తున్నాయని వివరించారు. మూడో దశ వ్యాప్తి ఉన్నట్లు వస్తున్న సమాచారం మేరకు సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన వివరించారు. చిన్న పిల్లల కోసం 200 పడకలు సిద్ధం చేశామన్నారు. వెంటిలేటర్లు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. అవసరమైన ఆధునిక పరికరాలు సమకూర్చి చర్యలు చేపట్టామన్నారు.
ఇదీ చదవండీ..srisailam reservoir: శ్రీశైలం జలాశయంలో తగ్గిన వరద.. పులిచింతలలో పెరిగిన నీటిమట్టం
TAGGED:
విజయనగరం జిల్లా తాజా వార్తలు