రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ప్యూ విజయనగరం జిల్లాలో ప్రారంభమైంది. అత్యవసర సేవలు మినహా అన్ని దుకాణాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. కరోనా నిబంధనలను అనుసరిస్తూ అనుమతించిన సంస్థలు, కార్యాలయాల కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులు, వైద్య సిబ్బందిని.. గుర్తింపు కార్డులు పరిశీలించాకే అనుమతిస్తున్నారు. కర్ఫ్యూ మొదలైన తర్వాత ఆటోలు, టాక్సీలు, ఇతర వాహనాలను అనుమతించ లేదు.
మధ్యాహ్నం 12 గంటల తర్వాత అంతరాష్ట్ర, జిల్లాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల రద్దు నేపథ్యంలో పోలీసులు వాటి రాకపోకలను నిలిపివేస్తున్నారు. పార్వతీపురంలో కర్ఫ్యూతో రహదారులు ఖాళీ అయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు అన్ని దుకాణాలను మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపునిచ్చారు. సీఐ లక్ష్మణ రావు ఆధ్వర్యంలో ప్రధాన కూడలి వద్ద పోలీసులు... ప్రజలకు కర్ఫ్యూపై అవగాహన కల్పించారు.