పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లాలో 5.9సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భోగాపురంలో మండలంలో 11.1, కొత్తవలసలో 10.6, డెంకాడలో 8.2, వేపాడలో 7.9 పూసపాటిరేగ మండలంలో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గరుగుబిల్లి, సాలూరు, రామభద్రపురం, పార్వతీపురం, గరుగుబిల్లి మండలాల్లో 5 సెంటీమీటర్లు వర్షం కురిసింది. ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు పెద్దఎత్తున రావటంతో పలు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా తోటపల్లి జలాశయంలో నీటిమట్టం 2.033 టీఎంసీలకు పెరిగింది. ఇన్ ఫ్లో 4,750 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 4,423 క్యూసెక్కులుగా నమోదైంది. మరో ప్రధాన ప్రాజెక్ట్ తాటిపూడి జలాశయంలో 289.80 అడుగులకు నీటిమట్టం చేరింది. మధ్యతరహా ప్రాజెక్ట్ పాచిపెంటలోని పెద్దగడ్డ రిజర్వాయర్ నీటిమట్టం 213.30 మీటర్లకు చేరుకోవటంతో, ముందస్తుగా అధికారులు 1, 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
విజయనగరం జిల్లాలో కుండపోత వర్షాలు.. పంట నష్టం - విజయనగరం జిల్లా తాజా వార్తలు
విజయనగరం జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంటలు నేలకొరిగాయి. వరదనీరు పెద్దఎత్తున రావటంతో పలు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మరికొన్ని ప్రాంతాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. పత్తి పొలాలు తడసిపోగా, కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పంట తడచి ముద్దయింది. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర వద్ద తోటపల్లి కుడి ప్రధాన కాలువపై ఉన్న రహదారి వంతెనకు గండి పడటంతో వరిపైర్లు పూర్తిగా నీటమునిగాయి. పాచిపెంట మండలం పెద్ద గడ్డ జలాశయం నుంచి ముందస్తు సమాచారం లేకుండా దిగువకు నీటిని విడుదల చేయటంతో కర్రివలసలో పంట పొలాలు జలమయమయ్యాయి. మొక్కజొన్న నీటమునిగింది. సాలూరు మండలంలోని శివరాంపురం, పారన్న వలస వద్ద వేగావతి ఉదృతంగా ప్రవహిస్తోంది. మెంటాడ, గజపతినగరం మండలాల్లో కురిసిన వర్షాలకు చంపావతి నదికి వరదనీరు పొటెత్తింది. సమీప గ్రామాల ప్రజలు రాకపోకలకు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. మెంటాడ మండలంలోని ఆగూరు, రెల్లిగూడేం, సారాడవలస, గూడేం, జగన్నాధపురం, సాకివలస గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. చీపురుపల్లి మండలంలోని నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. పుర్రెయవలసలో రెండెకరాల వరి నెలకొరిగింది. రావివలసలో ఆరబోసిన మొక్కజొన్న వర్షానికి తడిసిపోయి మొలకలు వచ్చాయి. చీపురుపల్లి మండలంలోని నిమ్మలవలస-శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మధ్య కాకర్లవాని గెడ్డ వరద ఉద్ధృతి కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. మెరకముడిదాం మండలం శ్యామాయవలసలో ఈదురు గాలులకు స్తంభం నెలకొరిగటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: భారీగా నాటుసారా పట్టివేత..తొమ్మిది మంది అరెస్ట్