మార్చి 22 జనతా కర్ఫ్యూ మొదలుకొని, మూడు లాక్డౌన్లను విజయనగరం జిల్లా అధికార యంత్రాంగం సమర్థంగా అమలుచేసింది. రాష్ట్రంలో మొదటి కరోనా కేసు వచ్చిన 45 రోజుల తర్వాత విజయనగరం జిల్లాలో కేసు నమోదైంది. లాక్డౌన్లో కచ్చితమైన నిఘాతో జిల్లాలోకి ఎవరూ రాకుండా పోలీసులు పని చేశారు. కానీ.. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన జిల్లా వాసులు తిరిగి జిల్లాకు రావటం మొదలుపెట్టారు. లక్షలాది మంది వలస కూలీలు నడుచుకుంటూ, లారీలు, ట్రక్కుల్లో జిల్లాకు చేరుకున్నారు. ఇలా జిల్లాకు వచ్చిన వలస కూలీల కారణంగా మే 4న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి కేసులు పెరుగుతునే ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం కేసుల సంఖ్య 171కి చేరుకుంది. అంతేకాకుండా రాష్ట్రంలో కరోనా సోకిన మొదటి ఎమ్మెల్యే జిల్లా వాసి కావడం ఆందోళనకరం.
కరోనా సోకిన మొదటి ఎమ్మెల్యే.. జిల్లావాసే
ఈ నెల 10న అమెరికా నుంచి వచ్చిన శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీనివాసరావు కరోనాకు గురయ్యారు. అమెరికా నుంచి వచ్చిన నేపథ్యంలో శాసనసభ అధికారులు ఎమ్మెల్యేను బడ్జెట్ సమావేశాలకు అనుమతించలేదు. తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విజయనగరం వచ్చిన శాసనసభ్యుడు ట్రూ నాట్ పరీక్షలు చేయించుకున్నారు. ఆ ఫలితాల్లో ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. పాజిటివ్ రావటంతో నిర్ధరణ కోసం వైద్యాధికారులు స్వాబ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లోనూ పాజిటివ్ వచ్చింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన గన్మ్యాన్కూ కరోనా సోకినట్టు అధికారులు నిర్ధరించారు.
వైరస్ బారిన పడుతున్న అధికారులు