విజయనగరం జిల్లా బొబ్బిలి వేణుగోపాల స్వామి, శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం సీతారాంపురం సీతారామస్వామి ఆలయాల ఆభరణాలు లెక్కింపు బొబ్బిలిలో నిర్వహించారు. ఆలయాల అనువంశిక ధర్మకర్త సుజయ్ కృష్ణ రంగారావు, దేవాదాయ శాఖ అధికారులు భ్రమరాంబ, హర్షవర్ధన్, వినోద్ కుమార్ తదితర అధికారులు వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్లో ఉన్న ఆభరణాలను ఆలయానికి తీసుకువచ్చి లెక్కించారు. బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయానికి 10 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. 146 రకాల ఆభరణాలు ఉన్నట్లు లెక్కింపులో తేల్చారు.
సీతారామస్వామి ఆలయానికి కూడా 10 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు లెక్కింపులో తేల్చారు. 66 రకాల వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. అధికారుల వద్ద ఉన్న రికార్డుల మేరకు ఆభరణాలు ఉన్నట్లు తేల్చారు. కెంపులు, వజ్రాలతో బంగారు వస్తువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయ పరిధిలోనే సీతారామ స్వామి ఆలయం కొనసాగుతుంది. ఈ రెండు ఆలయాలకు ధర్మకర్తగా సుజయకృష్ణ రంగారావు వ్యవహరించడంతో ఆభరణాలను ఇక్కడే లెక్కించారు. మిగిలిన ఇతర వస్తువులను మంగళవారం లెక్కింపు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.