విజయనగరం జిల్లాలో ఈ ఏడాది 10.02వేల హెక్టార్లలో పత్తిని సాగు చేశారు. సీజన్ ఆరంభంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనటం వల్ల పత్తిసాగు విస్తీర్ణం తగ్గింది. జిల్లాలో సాలూరు, పాచిపెంట, రామభద్రపురం మండలాల్లోనే 60 శాతానికి పైగా పత్తి సాగవుతుంది. గజపతినగరం, దత్తిరాజేరు, పార్వతీపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రైతులు కొంతమేర పత్తి సాగు చేస్తారు. ఈ ఏడాది భారీ వర్షాలు పత్తి రైతులను చిత్తు చేశాయి. తొలుత వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ...పూత, కాత సమయంలో కలసి రావటం వల్ల రైతులు సంబరపడ్డారు. మెరుగైన దిగుబడులు వస్తాయని..అప్పుల నుంచి గట్టెక్కవచ్చని ఆశించారు. అయితే...దిగుబడులు చేతికొచ్చే సమయంలో ఎడతెరిపి లేని వర్షాలు పత్తి పంటకు తీరని నష్టాన్ని మిగిల్చాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం క్వింటాకు రూ. 5,855 మద్దతు ధర ప్రకటించింది. దీంతో పెట్టుబడులైన దక్కించుకోవచ్చని రైతులు ఆశించారు. ఈ మేరకు...రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసేందుకు సాలూరు ఏఎంసీ ఆవరణలో అక్టోబరు 29న కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రంలో 1200 మంది రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కిలో పత్తిని కూడా కొనుగోలు చేయలేదు. ఇక్కడ కొనుగోళ్లు నిలిపేసి బూశాయవలస సమీపంలోని జిన్నింగ్ మిల్లుకు తీసుకెళ్లమంటున్నారు. అక్కడ నాణ్యత పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తుండటంతో..అన్నదాతలు దళారులను ఆశ్రయిస్తున్నారు. క్వింటా రూ.4 వేలకే అమ్ముకోని నష్టపోతున్నారు.
భారీ వర్షాలు, తుపాన్లతో పత్తి రైతులు ఇప్పటికే కుదేలయ్యారు. దిగుబడులు చేతికొచ్చే సమయంలో సుమారు 25వేల క్వింటాళ్ల పంట వర్షార్పణమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన అరకొర పంటను అమ్ముకుందామంటే నాణ్యత పేరుతో వ్యాపారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం మూసేయటంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.
దళారులు క్వింటా రూ. 3,600 అడుగుతున్నారు. జిన్నింగ్ మిల్లుకు తీసుకెళ్తే...అక్కడ నాణ్యత పేరుతో కొనుగోలు చేయటం లేదు. తిరిగి పత్తిని ఇంటికి తీసుకురాలేక ఇబ్బందులు పడుతున్నాం. వర్షాలతో దిగుబడి అంతంత మాత్రంగానే ఉన్నా...కనీసం మద్దతు ధర వస్తుందని ఆశించాం. కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రం మూసేయటంతో దళారులను ఆశ్రయించక తప్పటం లేదు.
- అప్పల నాయుడు, రైతు