విజయనగరం జిల్లాలో గత 3 నెలల కాలంలో 50 నుంచి 60 మంది నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. అందుకు ఎన్నో కారణాలున్నా ప్రధాన కారణం మాత్రం కరోనానే. దీనివలన సరైన సమయానికి చికిత్స అందక ఎందరో శిశువులు మృతిచెందారు.
చూడకుండానే మందులు
జిల్లాలోని పార్వతీపురానికి చెందిన ఓ మహిళ లాక్ డౌన్ సమయంలోనూ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఓ వైద్యురాలి వద్దకు పరీక్షలకు వెళ్లేవారు. కరోనా భయంతో ఆ డాక్టర్ ఆమె పరిస్థితిని సరిగ్గా చూడకుండానే అంతా బాగానే ఉందని చెప్పి మందులు రాసి పంపేవారు. తీరా ప్రసవ సమయానికి కడుపులో బిడ్డ బరువు తక్కువగా ఉందని చెప్పి శస్త్రచికిత్స చేయగా కవలలు జన్మించారు. వారిలో ఏ ఒక్కరూ దక్కలేదు. ముందుగానే పరీక్షలు చేసి కవలలనే విషయం చెప్పి ఉంటే జాగ్రత్తగా ఉండేదాన్నంటూ ఆ మహిళ వాపోయింది.
తక్కువ బరువుతో
విజయనగరానికి చెందిన ఓ గర్భిణి ప్రతినెలా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంది. నెలలు నిండాయని ప్రసవం కోసం వెళితే ఉమ్మనీరు తగ్గింది. వెంటనే శస్త్రచికిత్స చేయాలని ఆసుపత్రిలో చేరమన్నారు. చివరికి బిడ్డ కేజీన్నర బరువుతో పుట్టింది. బతకడం కష్టమని వైద్యులు చేతులెత్తేశారు.
ఎస్.కోట మండలానికి చెందిన ఒక బాలింత తన బిడ్డకు అత్యవసర వైద్యం అవసరమని కేజ్ హెచ్‌కు తీసుకెళ్లింది. ఆ గ్రామంలో పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్నాయని, తగ్గాక రావాలని వెనక్కి పంపించేశారు.