విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని జూట్ మిల్లు సుమారు వందేళ్ల క్రితం ప్రారంభమైంది. ప్రస్తుతం మిల్లులో సుమారు 2వేల మంది రెగ్యులర్, ఒప్పంద కార్మికులు పని చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి లాకౌట్ ప్రకటిస్తూ మిల్లు యాజమాన్యం నోటీసు అతికించింది. గతేడాది మే నుంచి ఇప్పటి వరకు మిల్లుకు రెండున్నర కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు నోటీసులో పేర్కొంది. ఇదే సమయంలో.. కరోనా కారణంగా ముడిసరకు రాకపోవడం.. కొవిడ్ బారిన పడి కార్మికుల హాజరు శాతం పడిపోవటంతో మరింత నష్టాలు వస్తున్నాయని యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం అత్యవసర విభాగాల కార్మికులను మాత్రమే అనుమతిస్తామని.. ఈ మేరకు కార్మికుల జాబితాను ప్రకటిస్తామని యాజమాన్యం నోటిసులో పేర్కొంది.
లాకౌట్ ప్రకటనపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. తమతో గానీ.. అధికారులతో గానీ ఎలాంటి సంప్రదింపులు చేయకుండా.. లాకౌట్ ప్రకటించడమేంటని ప్రశ్నిస్తున్నారు.