ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకొని రావాలనే లక్ష్యంతో ప్రభుత్వం నూతనంగా ఇసుక పాలసీకి రూపకల్పన చేసిందని విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి అన్నారు. ఎక్సైజ్, మైన్స్ ఎస్ఈబీ అధికారులతో జిల్లా పోలీసు సమావేశ మందిరంలో సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాకు ఎవరు పాల్పడినా ఉపేక్షించకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం స్పెషల్ ఎన్పోర్సుమెంట్ బ్యూరోను ఏర్పాటు చేసిందన్నారు. మైన్స్, ఎక్సైజ్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేసి... ఇసుక అక్రమ రవాణా, మద్యం, సారా తయారీ కేంద్రాలపై ఉక్కు పాదం మోపాలని పేర్కొన్నారు. అక్రమ రవాణా గురించిఎక్సైజ్ అధికారులకు సమాచారం వస్తే వాట్సాప్ నంబరు 6309898989కు లేదా డయల్ 100కు ఫోను చేసి పోలీసుల సహకారాన్ని పొందవచ్చునన్నారు. పోలీసు శాఖలో ఆకస్మిక దాడులు చేపట్టేందుకు స్నైపరు టీంలు, ఎస్ఈబి పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు జిల్లాలో 8 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, వాటిలో పని చేసేందుకు మాజీ సైనికోద్యోగులను ఎస్పీఓలుగా నియమించామన్నారు. ఈ చెక్ పోస్టుల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసి, నిఘా ఏర్పాటు చేసామని తెలిపారు. ఒడిస్సా సరిహద్దులో ఉండే వైన్ షాపులను, సారా తయారీ కేంద్రాలను గుర్తించి, మ్యాపింగు చేసి, ఒడిస్సా అధికారుల సహకారంతో దాడులు చేపట్టాలన్నారు.
ఎంతటి వారైనా సహించేది లేదు...
అక్రమాలకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి అన్నారు. ఆమె ఎక్సైజ్, మైన్స్ ఎస్ఈబీ అధికారులతో జిల్లా పోలీసు సమావేశ మందిరంలో సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అదే విధంగా ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావటానికి ఇసుక పాలసీని రూపకల్పన చేశామని, ఇసుక అక్రమ రవాణాకు ఎవరు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు.
విజయనగరం జిల్లాలో సమన్వయ సమీక్ష సమావేశం