Construction Cost increased: ఇళ్ల నిర్మాణంలో వినియోగించే కంకర 20 టన్నుల లారీ లోడు పలు జిల్లాల్లో రూ.10 వేలకు లభించేది. ఇప్పుడు టన్నుపై రూ.150-200 వరకు ధర పెరగడంతో లారీ లోడు రూ.14 వేలకు చేరింది. గ్రానైట్ వివిధ రకాలకు అనుగుణంగా చదరపు అడుగు రూ.60 నుంచి రూ.130కి లభించేది. ప్రస్తుతం చదరపు అడుగుపై రూ.15-20 వరకు పెరిగింది. రాష్ట్రంలో కొంతకాలంగా నిర్మాణ రంగం నీరసించింది. ప్రభుత్వపరంగా నిర్మాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అపార్ట్‌మెంట్లు, సొంత ఇళ్ల నిర్మాణాల సంఖ్య తక్కువగానే ఉంది. కంకర, మొరం, గ్రానైట్ వంటి వ్యాపారాలు సగానికిపైగా తగ్గిపోయాయి. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం రాబడి పెంచుకోవడమే లక్ష్యంగా ఖనిజాలపై భారం మోపింది. సీనరేజ్, ఇతర రుసుములను భారీగా పెంచేసింది. దీంతో లీజుదారులు, వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. అంతిమ భారం ఇళ్లు నిర్మించుకునే సామాన్య, మధ్యతరగతి వర్గాలపై పడుతోంది.
నాలుగు ఉత్తర్వులతో బాదుడు..
జీవో 42: గ్రానైట్ మినహా ఇతర చిన్నతరహా ఖనిజాలకు సీనరేజ్ ఫీజుతోపాటు అంతే మొత్తాన్ని కన్సిడరేషన్ నగదుగా అదనంగా చెల్లించాలి. అంటే గతంలో రహదారి కంకర టన్నుకు రూ.60 సీనరేజ్ ఫీజు ఉండగా, ఇపుడు కన్సిడరేషన్ నగదుతో కలిపి రూ.120 అయింది. గ్రానైట్‌కు సీనరేజ్ ఫీజుతోపాటు అందులో 50% కన్సిడరేషన్ నగదు చెల్లించాల్సి వస్తోంది. వీటికి మళ్లీ జిల్లా ఖనిజ నిధి, మెరిట్ అదనంగా ఉంటుంది.
జీవో 65: కొత్తగా లీజులకు దరఖాస్తు చేసుకునేవారు.. విస్తీర్ణానికి అనుగుణంగా చెల్లించే వార్షిక డెడ్‌రెంట్ విలువకు పది రెట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. ఇప్పటికే లీజులు ఉన్నవారు అయిదు రెట్లు చెల్లించాలి. అంటే గ్రానైట్‌కు హెక్టారుకు వార్షిక డెడ్‌రెంట్ రూ.1.30 లక్షలు ఉందనుకుంటే... కొత్త దరఖాస్తుదారులు రూ.13 లక్షలు, ప్రస్తుత లీజుదారులు రూ.6.50 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి.
జీవో 90: మైనింగ్ ప్లాన్ ప్రకారం తొలిఏడాది 10%, రెండో ఏడాది 20%, మూడో ఏడాది 40%, నాలుగో ఏడాది నుంచి 60% మేర ఖనిజ ఉత్పత్తి చేయాలి. అంత ఉత్పత్తి లేకున్నా... ఈ మేరకు సీనరేజ్ చెల్లించాల్సి ఉంటుంది.
జీవో 13: పీసీబీ ఇచ్చే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సీఎఫ్‌ఈ), కన్సెంట్ ఫర్ ఆపరేషన్ (సీఎఫ్‌వో) అనుమతి ఫీజులు భారీగా పెరిగాయి. గతంలో టర్నోవర్ బట్టి ఉండగా, ఇపుడు విస్తీర్ణం, ఉత్పత్తి ఆధారంగా.. టన్ను, క్యూబిక్ మీటర్ చొప్పున చెల్లించాలి.