విజయనగరం జిల్లాలోని ఆంధ్రా-ఒడిశా(AOB) రాష్ట్ర సరిహద్దు కొఠియా గ్రూప్ గ్రామాల గిరిజనులకు జిల్లా పోలీసుశాఖ అండగా నిలుస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయకుండా ఒడిశా(odisha) ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఇక్కడి ఓటర్లు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతేకాదు.. తాము ఏపీ వైపే ఉంటామని ఒడిశా అధికారులకు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కొఠియా గిరిశిఖర గ్రామాల సమస్యలపై పోలీసుశాఖ(police department) అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు కమ్యూనిటీ పోలీసింగ్(community policing) పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. మీ వెంట మేము ఉన్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా మక్కువ మండలం గిరిశిఖరలో నిర్వహించిన కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో స్వయంగా జిల్లా ఎస్పీ పాల్గొని వారి సాధక బాధకాలను తెలుసుకున్నారు. గిరిజన యువత మావోయిస్టు(maoist) కార్యకలాపాల పట్ల ఆకర్షితులు కావద్దని.. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు.
పోలీసు శాఖ ఉన్నతాధికారులు.. మారుమూల గిరిజన గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడంపై గిరిపుత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ పేరుతో రహదారి నిర్మాణానికి పోలీసులు సహాయం అందించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దీనివల్ల శతాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న డోలీ బాధలు తప్పాయంటున్నారు.