మోనిటరింగ్ ఆన్‌లైన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పై జిల్లా పరిధిలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ సమావేశమయ్యారు. ప్రతి మున్సిపాలిటీలో ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిషనర్లను ఆదేశించారు. చెత్త నిర్వహణ పద్ధతులు, దానికి తీసుకున్న చర్యలపై అంశాలవారీగా చర్చించారు. తమ పరిధిలో అవలంబిస్తున్న విధానాలను, తీసుకున్న చర్యలను కమిషనర్లు వివరించారు.
ప్లాస్టిక్ నివారణపై ప్రతిఒక్కరు దృష్టి పెట్టాలి
ప్రకృతికి తీరని హాని చేసే ప్లాస్టిక్‌ను నిర్మూలించడంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్లాస్టిక్ నియంత్రణకు తీసుకున్న చర్యలపై బొబ్బిలి మినహా మిగిలిన మున్సిపాలిటీలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఆ తరువాత ప్లాస్టిక్‌ను విక్రయించేవారిపైనా, వినియోగించే వారిపైనా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజల్లో అవగాహన కల్పించాలి
అన్ని మున్సిపాలిటీల్లో డెబ్రిస్‌ను ఇష్టానుసారం ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని... దీనిని అరికట్టేందుకు ఒక పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలన్నారు. డిసెంబరు 1 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, ఆ నెలంతా ఎక్కడికక్కడ పేరుకుపోయిన డెబ్రిస్‌ను తొలగించి, ఒక నిర్ణీత ప్రదేశాన్ని కేటాయించాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా డెబ్రిస్ వేసేవారికి జనవరి నుంచి జరిమానాలు విధించడంతో పాటు, తరలించేందుకు అయ్యే వ్యయాన్ని సైతం వారివద్దనుంచే రాబట్టాలని చెప్పారు.