భారతదేశంలో అత్యధికంగా కొబ్బరిసాగు చేసే రాష్ట్రాల్లో... కేరళ, కర్ణాటక, తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. రాష్ట్రంలో 1.05 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగవుతోంది. రాష్ట్రంలో కొబ్బరి ఉత్పత్తి, ఉత్పాదకతలో... ఉభయ గోదావరి జిల్లాలదే సింహభాగం. విజయనగరం జిల్లా విషయానికొస్తే... గత నాలుగేళ్ల వరకు 3వేల హెక్టార్లకే పరిమితమైన ఈ పంట సాగు... ప్రస్తుతం 6వేల హెక్టార్లకు విస్తరించింది. ఈ క్రమంలో ఉప ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు ఊపందుకున్నాయి. ఇప్పటికే నాలుగు కొబ్బరి పీచు తయారీ కేంద్రాలు ఉండగా... వీటికి అనుబంధంగా 25 వరకు తాళ్లు, కాయిర్ మ్యాట్ల యూనిట్లు నెలకొన్నాయి.
కొబ్బరి పొట్టుతో కంపోస్ట్...
వినియోగదారుని అవసరాన్ని బట్టి, వివిధ సైజుల్లో తాళ్లను తయారు చేస్తున్నారు. వీటిని తెలుగు రాష్ట్రాలతో పాటు....కోల్కతా, ఛత్తీస్ఘడ్, మహారాష్ట్రకు ఎగుమతి చేస్తున్నారు. కొబ్బరి పీచు తయారీ ద్వారా వచ్చిన పొట్టు, వ్యర్ధ పదార్ధాల నుంచి పరిశ్రమదారులు సేంద్రీయ ఎరువులను తయారు చేస్తున్నారు. ఈ సేంద్రీయ ఎరువు వినియోగంపై రైతులు ఆసక్తి చూపుతుండటంతో... దీనికి క్రమంగా గిరాకీ పెరుగుతోంది.