'జగనన్న వసతి దీవెన' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ విజయనగరంలో లాంఛనంగా ప్రారంభించారు. అయోధ్య మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం హాజరయ్యారు. వసతి దీవెనతో చదువులు సజావుగా సాగాలని అన్నారు. డిగ్రీ, సాంకేతిక విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్టు చెప్పారు. విద్యార్థుల వసతికి ఈ పథకం ఆసరాగా ఉంటుందని చెప్పారు. ఒక కుటుంబంలో ఎందరు చదువుకుంటే.. అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్టు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి నగదు నేరుగా జమ అవుతుందని చెప్పారు.
వారితో యుద్ధం చేస్తున్నా.. నన్ను ఆశీర్వదించండి: సీఎం - Cm Ys Jagan launched Jagananna Vasati Deevena scheme in Vijayanagaram
ముఖ్యమంత్రి జగన్ మరో పథకాన్ని ప్రారంభించారు. విజయనగరంలో పర్యటించిన సీఎం.. 'జగనన్న వసతి దీవెన' పథకానికి శ్రీకారం చుట్టారు. ఓ ఇంట్లో ఎందరు చదువుకున్నా సరే.. అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు సంతోషంగా తమ పిల్లలను బడికి పంపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమ్మ ఒడి పథకానికి 3 వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని తెలిపారు. చదువుకునే వారందరికీ 6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. రాబోయే మూడేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చబోతున్నామని.., నాలుగేళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. తెలుగు భాషను తప్పనిసరి చేస్తున్నామని అన్నారు.
చిన్నారులు ఇంటి దీపాలు కావాలని సీఎం ఆకాంక్షించారు. విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. దశల వారీగా మద్య నిషేధాన్ని అమల్లోకి తెస్తున్నామని గుర్తు చేశారు. ఇన్ని చేస్తున్నా తనపై.. కొందరు విమర్శలు చేస్తున్నారని, డబ్బులిచ్చి మీడియాలో వార్తలు రాయిస్తున్నారని ప్రతిపక్షాల వైఖరిని తప్పుబట్టారు. ప్రజాబలంతో, దేవుడి ఆశీస్సులతో మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటానని స్పష్టం చేశారు. తాను రాక్షసులతో యుద్ధం చేస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి.. ప్రజల ఆశీర్వాదాలు కావాలని కోరారు.