Foundation Stone for Bhogapuram International Airport: విజయనగరం జిల్లా భోగాపురంలో 5వేల కోట్ల రూపాయలతో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి నేడు మరోసారి భూమిపూజ జరగనుంది. మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేలా.. భారీ విమానాలు దిగేలా 3.8 కిలోమీటర్ల రన్ వే పూర్తి చేయనున్నారు.అయితే.. విమానాశ్రయ నిర్వాసితులకు యుద్ధప్రాతిపదికన కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని అప్పట్లో జిల్లా అధికారులు ప్రకటన చేశారు.
కానీ.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని నిర్వాసితులు వాపోతున్నారు. పునరావాస గ్రామాల్లో సుమారు 80 కుటుంబాలు తాత్కాలికంగా వలస వెళ్లాయి. రేషన్ కార్డులనూ వలస వెళ్లిన చోటుకు బదిలీ చేయించుకున్నారు. రేషన్‌కార్డుల మారిపోయినందున స్థానికులు కాదంటూ పునరావాస కాలనీలో స్థలాలు కేటాయించడంలేదని... నిర్వాసితులు వాపోతున్నారు. తమ గోడు ఎవరికీ పట్టడం లేదని ఆవేదన చెందుతున్నారు.
"ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటికి కూడా వాటిని నెరవేర్చలేదు. ఇక్కడ మాకు సరైన సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అలాగే ఇంటర్, డిగ్రీ పూర్తి అయిన వారికి ఉద్యోగం ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు వాటి గురించి అడుగుతుంటే ఏ ఒక్కరూ కూడా సమాధానం చెప్పడం లేదు. ఇప్పటికైనా మా సమస్యలను పరిష్కరించాలి"-భోగాపురం విమానాశ్రయం నిర్వాసితులు
విమానాశ్రయానికి భూములిచ్చిన వారికి అర్హత మేరకు ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే... అధికారులు పట్టించుకోవటం లేదని నిర్వాసిత కాలనీల యువత, తల్లిదండ్రులు వాపోతున్నారు.