CM Jagan Visited Vizianagaram Train Accident Victims:విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద దుర్ఘటనలో గాయపడిన వారిని సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద క్షతగాత్రులు, మృతుల కుటుంబాలను సీఎం పరామర్శించారు. క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. బాధితులు, అధికారుల నుంచిప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రైలు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను సీఎం పరిశీలించారు. సీఎం పర్యటిస్తే ట్రాక్ పునరుద్ధరణ పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున... ఆ పర్యనటను రద్దు చేసుకోవాలంటూ రైల్వే అధికారులు చేసిన విజ్ఞప్తి చేశారు. అధికారుల సూచన మేరకు ప్రమాద స్థలి సందర్శన షెడ్యూలను సీఎం జగన్ రద్దు చేసుకున్నారు. ప్రమాద స్థలంలో బోగీల తొలగింపు, ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పర్యటనలో మార్పులు జరిగినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఇప్పటికే మృతుల కుటుంబాలకు ₹10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ₹2 లక్షలు, చిన్న చిన్న గాయాలు తగిలిన వారికి ₹50 వేలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Vizianagaram Train Accident: నిశీధిలో.. పట్టాలపై మరో ఘోరం.. నిద్రలోనే తెల్లారిన బతుకులెన్నో..!
మంత్రి బొత్స సత్యనారాయణ: విజయనగరం రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని... మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను బొత్స పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కంటకాపల్లిలో జరిగినటువంటి రైలు ప్రమాద ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం 29 మందికి జిల్లా ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నట్లు బొత్స పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో 13 మంది చనిపోయారని వెల్లడించారు. మృతుల్లో ఒకరు రైల్వే ఉద్యోగికావడం వల్ల.. ఆయన మృతదేహం రైల్వేశాఖ స్వాధీనంలో ఉన్నట్లు తెలిపారు. మిగతా 12 మృతదేహాలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు బొత్స తెలిపారు. ఇప్పటికే ఆరు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని బొత్స తెలిపారు. ఆయా మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు.