CM Jagan Tour in Kurupam: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. కురుపాం వేదికగా నాలుగో విడత 'అమ్మ ఒడి' పథకం నిధులు విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కురుపాం పర్యటన నిమిత్తం సీఎం.., ఉదయం తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని.., అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్తారు. విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కురుపాం మండలం చినమేరంగి పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
హెలిప్యాడ్ నుంచి బయలుదేరి కురుపాంలోని సభా స్థలానికి చేరుకుని అమ్మ ఒడి నాలుగో విడత నిధులను విడుదల చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సభ అనంతరం హెలికాప్టర్లో విశాఖపట్నంకు బయలుదేరతారు. కాగా, నూతనంగా ఏర్పాటైన మన్యం జిల్లాకు.., మొదటిసారిగా సీఎం వస్తుండటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులను అధికారులు సమీకరించనున్నారు. ఈ మేరకు.. 400 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా., సీఎం సభకు విద్యార్ధులను తీసుకొచ్చే బాధ్యతలను.. జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులకు అప్పగించినట్లు సమాచారం. సీఎం పర్యటనకు 1700మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
చెట్ల నరికివేత: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్న వేళ.. జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో పాలిటెక్నిక్ కళాశాల దగ్గర హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. ఇక సీఎం జగన్ సభలు, సమావేశాలు అంటే చెట్లు కొట్టడం, డివైడర్లు తీయించడం కామన్ అయిపోయింది. తాజాగా చినమేరంగి నుంచి కురుపాం వరకు సీఎం వెళ్లనున్న మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. ముఖ్యమంత్రి ప్రయాణించే రహదారికి రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున కొమ్మలు తొలగించినట్లు అధికారులు వివరించారు. గత కొన్ని రోజులుగా జిల్లా అధికారులు, నాయకులు సభ స్థలం, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
రాత్రికి రాత్రి 'నాడు-నేడు' పనులు.. సీఎం వస్తున్నారని హడావుడి..: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'నాడు-నేడు' పనులను ముమ్మరం చేశారు. ప్రిన్సిపల్ ఖాతాలో నిధులు ఎప్పుడో జమైనా ఇన్నాళ్లు జాప్యం చేస్తూ వచ్చారు.. తాజాగా నేడు (జూన్ 28) ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కిటికీల ఏర్పాటు, మరమ్మతుల పనులను సిబ్బంది దగ్గరుండి సోమవారం రాత్రి చేయించారు. దీనిని పార్వతీపురం మన్యం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిణి మంజులా వీణ వద్ద ప్రస్తావించగా.. ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో అత్యవసరంగా సంబంధిత పనులు వేగవంతం చేసినట్లు ఆమె వివరించారు. నాడు-నేడు విభాగం రాష్ట్ర కమిషనర్ కాటంనేని భాస్కర్ పనులు పరిశీలించారు. సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, డీఈవో ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.