మరో ప్రతిష్టాత్మక పథకానికి వైకాపా ప్రభుత్వం శ్రీకారం 'జగనన్న వసతి దీవెన' పథకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ విజయనగరం జిల్లాలో అంకురార్పణ చేయనున్నారు. భోజనం, వసతి సౌకర్యాలకు ఉపయోగపడే విధంగా ఈ పథకం కింద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తారు. ఐటీఐ విద్యార్థులకు ఏటా 10 వేల రూపాయలు, పాలిటెక్నిక్ 15, డిగ్రీ ఆపై కోర్సుల వారికి 20 వేల రూపాయల చొప్పున అందించనున్నారు.
కుటుంబ వార్షిక ఆదాయం రెండున్నర లక్షల లోపు ఉన్న ప్రతి విద్యార్థికీ జగనన్న వసతి దీవెన పథకం వర్తించనుంది. 11 లక్షల 87వేల 904 మందికి ప్రయోజనం కలగనుందని అధికారులు తెలిపారు. 53,720 మంది ఐటీఐ, 86,896 మంది పాలిటెక్నిక్, 10 లక్షల 47,288 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందనుంది.
ఈ పథకానికి మొత్తం 2 వేల 278 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అమ్మఒడి తరహాలోనే ఆర్థిక సాయాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే రెండు విడతల్లో జమ చేస్తారు. అర్హులైన ప్రతి విద్యార్థికి యూనిక్ బార్ కోడ్‌తో స్మార్డ్ కార్డులు జారీ చేస్తారు. ఈ నెల 25 నుంచి గ్రామ వాలంటీర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆ కార్డులను స్వయంగా అందజేస్తారు. విజయనగరం జిల్లాలో 59,688 మంది విద్యార్థులకు ఈ పథకంతో లబ్ధి చేకూరనుంది.
ఉదయం గన్నవరం నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకోనున్న సీఎం జగన్... అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా విజయనగరంలోని పోలీసు పరేడ్ మైదానానికి 11 గంటలకు చేరుకుంటారు. అయోధ్య మైదానంలోని బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకొని ప్రసంగిస్తారు. అనంతరం పోలీసు బ్యారెక్స్ వద్ద ఏర్పాటు చేసిన 'దిశ' పోలీస్‌స్టేషన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
ఇదీ చదవండీ... వైకాపా దౌర్జన్యాలు పరాకాష్ఠకు చేరాయి: యనమల