కొందరు స్వార్ధపరులు న్యాయపరమైన అడ్డుంకులు సృష్టించగా.. 3.74 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని విజయనగరం పర్యటనలో సీఎం జగన్ తెలిపారు. గుంకలాంలో 'నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో ఆయన పాల్గొని.. 12,301 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. అమరావతిలో 54 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి నిర్ణయించగా.. కొందరు కుల ప్రస్థావన తీసుకొచ్చి కోర్టుల్లో పిటిషన్లు వేశారని సీఎం జగన్ విమర్శించారు. నిరుపేదలకు ఇచ్చే ఆస్తులపై 44వ రాజ్యాంగ సవరణ చేస్తే.. న్యాయస్థానాలు స్టే ఇవ్వడం బాధాకరమన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధర్మం కోసం పోరాడుతామని.. న్యాయపరమైన అడ్డంకులు తొలగి అందరికీ మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేశారు.
ఘన స్వాగతం...
సీఎం జగన్‌కు ఉప ముఖ్యమంత్రులు పుష్పశ్రీవాణి, కృష్ణ దాసు, మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎంపీలు బెల్లన చంద్రశేఖర్, మాధవి, ఎంవీవీ.సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు విజయ్‌సాయి రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ హరి జవహర్ లాల్ ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. తొలుత ఇళ్ల పట్టాలకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం.. లే-అవుట్లో నిర్మించిన నమూనా ఇంటిని మంత్రులు, అధికారులతో కలిసి పరిశీలించారు. లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
చిరునవ్వుతోనే భరిస్తున్నాం...
3,648 కి.మీ పాదయాత్రలో అన్ని కష్టాలు చూశానని సీఎం జగన్ పేర్కొన్నారు. అక్క, చెల్లెమ్మల కష్టాలు తీర్చేందుకు 25 లక్షలు ఇళ్లు నిర్మిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లు గుర్తు చేశారు. హామీ ఇచ్చిన వాటి కంటే ఎక్కువగా.. 30 లక్షల 75 వేల గృహాలు నిర్మిస్తున్నామని తెలిపారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. అర్హత ఉన్న పేదవాళ్లకు 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చే ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ నిరంతర ప్రక్రియ ద్వారా కాలనీలు కాకుండా ఊళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. కోటి 24 లక్షల మంది లబ్ధిపొందుతున్నారన్నారు. 15.60 లక్షల గృహాలు తొలిదశలో.. 12 లక్షలు రెండవ దశలో నిర్మాణం చేపడతామన్నారు. 224 గజాల్లో ఇళ్లు ఇవ్వాలని తొలుత భావించినా.. తర్వాత విస్తీర్ణాన్ని 340 ఎస్ఎఫ్టీకి పెంచామన్నారు. ప్రస్తుతం 68,300 ఎకరాల భూముల్లో.. లబ్ధిదారుల ఆసక్తి మేరకు మూడు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో గృహాల నిర్మాణం చేపడుతున్నామన్నారు. 2.60 లక్షలు టిడ్కో ఇళ్లు నిర్మించడమే కాక.. 3000 చ.అ. ఫ్లాట్ ఒక్క రూపాయికే అందించనున్నట్లు తెలిపారు. రూ. 4,287 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతున్నా.. చిరునవ్వుతోనే భరిస్తున్నామన్నారు.
అడ్డంకులతోనే ఆలస్యం..
ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన అనుచరులు కోర్టులో స్టేలు తేవడం వల్ల.. తన సొంత నియోజకవర్గం పులివెందులలోనూ ఇళ్ల పట్టాలు పంచలేకపోయానని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో 54 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చూస్తే.. మతాల పేరిట పిటిషన్లు వేశారని విమర్శించారు. విశాఖలో లక్షా 80 వేల మందికి ఇళ్ల పంపిణీ ఏర్పాట్లు చేస్తే.. భూ సమీకరణ పేరిట అడ్డుకున్నారని ఆరోపించారు. రాజమహేంద్రవరంలో 27 వేల మంది పేదలకు స్థలాలు ఇవ్వాలని చూస్తే.. ఆవ భూములు అంటూ న్యాయస్థానం ద్వారా ఆపేశారని పేర్కొన్నారు. వారు సృష్టించిన అడ్డంకుల కారణంగా 3.74 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యమవుతోందన్నారు.
హామీల్లో 95 శాతం పూర్తి...