CM Jagan Laid Foundation Stone to Central Tribal University: విజయనగరం జిల్లాలో ఏర్పాటుకానున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం గిరిపుత్రుల జీవితాల్లో విద్యాకాంతులు నింపుతుందని సీఎం జగన్ అన్నారు. మెంటాడ మండలం చిన్నమేడపల్లి వద్ద యూనివర్సిటీ నిర్మాణానికి.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. మరో మూడేళ్లలో వర్శిటీని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. గిరిజన విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఈ విశ్వవిద్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.
నాలుగేళ్ల వైసీపీ పాలనలో విద్య, వైద్యానికే పెద్దపీట వేశామని సీఎం జగన్ అన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల పరిధిలోని చినమేడపల్లి వద్ద 834 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలసి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం దత్తిరాజేరు మండలం మరడాం వద్ద బహిరంగ సభలో పాల్గొన్నారు. గిరిజన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా విద్యావకాశాలు కల్పించామని సీఎం తెలిపారు. అందులో భాగంగానే ప్రతిష్ఠాత్మక గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ఈ వర్సిటీతో గిరిపుత్రుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని సీఎం ఆకాంక్షించారు.
"కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాల శాశ్వత భవనాల నిర్మాణానికి సంబంధించి పునాదులు వేస్తున్నాం. ఇది దాదాపు 830 కోట్ల రూపాయల ప్రాజెక్టు.. మరో మూడు సంవత్సరాలలో జాతీకి అంకితం చేయబోయే గొప్ప అడుగు ఈ ప్రాజెక్టు." -సీఎం జగన్
వెనుకబడిన ఉత్తరాంధ్రలో వెలుగులు నింపేందుకు విద్యకు పెద్దపీట వేశామని సీఎం తెలిపారు. గిరిజన ప్రాంతంలోనే 2 వైద్య కళాశాలలు, ఒక గిరిజన విశ్వవిద్యాలయం, ఒక గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ కనిపిస్తున్నాయని చెప్పారు. నాడు- నేడుతో గిరిజన పాఠశాలల స్ధితిగతులు మార్చామన్నారు. వర్సిటీకి భూములిచ్చిన రైతులకు 25 కోట్ల పరిహారం ఇప్పటికే చెల్లించామన్నారు. అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ ఉండే ప్రాంతంలో వర్సిటీని నిర్మిస్తున్నట్లు వివరించారు.