CM Jagan Comments: విజయనగరం జిల్లాలో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 19న శ్రీకాకుళం జిల్లా మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పుడు.. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం ఉండబోతున్నట్లు చెప్పిన జగన్.. ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని పునరుద్ఘటించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు విశాఖ ఆమోదయోగ్యమైన నగరంగా ఉంటుందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కీర్తి కిరీటంగా నిలవబోతుందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ఆయన.. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరానికి సమాన దూరంలో ఎయిర్‌పోర్టు ఉంటుందని చెప్పారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు మరో 3 ఏళ్లలో పూర్తవుతుందని.. 2026 నుంచే భోగాపురం వద్ద విమానాలు ఎగిరే పరిస్థితి నెలకొంటుందని స్పష్టం చేశారు.
ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో అభివృద్ధికి చిరునామాగా మారుతుంది. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళానికి సమాన దూరంలో ఎయిర్‌పోర్టు. రూ.195 కోట్లు ఖర్చు చేస్తూ తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ పనులు చేపడుతున్నాం. చింతపల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు కూడా శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు వెళ్లే ప్రాంతంగా ఉండేది.రాబోయే రోజుల్లో జాబ్ హబ్‌గా ఉత్తరాంధ్ర మారబోతోంది. ఒకవైపు పోర్టు, మరోవైపు ఎయిర్‌పోర్టు రాబోతోంది. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు మరో 3 ఏళ్లలో పూర్తవుతుంది. 2026 నుంచే భోగాపురం వద్ద విమానాలు ఎగిరే పరిస్థితి ఏర్పడుతుంది"-జగన్, ముఖ్యమంత్రి