Clap Vehicles Union: క్లాప్ వెహికల్ డ్రైవర్ల పీఎఫ్ డబ్బులు కాజేస్తున్న గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ స్వచ్ఛాంధ్ర క్లాప్ వెహికల్ డ్రైవర్స్ యూనియన్ విజయనగరం జిల్లా శాఖ పీఎఫ్ కార్యాలయం ముందు ధర్నాకు దిగింది. యూనియన్ జిల్లా అధ్యక్షుడు పొడుగు రామకృష్ణ అధ్యక్షతన విజయనగరంలోని పీఎఫ్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మద్ధతుగా ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. ఈ మేరకు ఏపీ స్వచ్ఛాంధ్ర క్లాప్ వెహికల్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు వారికి ప్రతి నెల 5వ తేదీలోగా జీతాలు చెల్లించాలని.. ఆదివారం, పండుగల సమయంలో సెలవు ఇవ్వాలని కోరారు. అలాగే తమ వేతనాల నుంచి కోత విధిస్తున్న పీఎఫ్‌ను విధిగా తమ పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని క్లాప్ వాహన చోదకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం ఏఐటీయూసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించి చెత్తను తరలిస్తున్న క్లాప్ డ్రైవర్ల శ్రమని గుత్తేదార్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. జీతానికి తగినట్టుగా పీఎఫ్ చెల్లింపులు జరగడం లేదన్నారు. అందులో జరుగుతున్న అవకతవకలపై అధికారులు జోక్యం చేసుకోవాలని.. పీఎఫ్ కమీషనర్ని కోరారు. తప్పులను సరిచేయకపోతే పీఎఫ్ చెల్లింపుల్లో పెద్ద దోపిడీ జరిగే అవకాశం ఉందని తెలిపారు. వారానికి ఒక్క రోజు కూడా విరామం లేకుండా శ్రమిస్తున్న పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన డ్రైవర్లతో చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం, కనీసం ఈఎస్ఐ సదుపాయం కల్పించకపోవటం విచారకరమన్నారు. మాకు న్యాయం చేయండి అని అడిగేవారిని ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామని గుత్తేదారులు బెదిరిస్తున్నారని.. ఇంత జరుగుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోకపోవటంపై ఏఐటీయూసీ నాయకులు మండిపడ్డారు.