CITU Leader Narasingha Rao Fires on YSRCP Over Ferro Alloys: పెట్టుబడులు, కొత్త పరిశ్రమల కోసం పెట్టుబడిదారుల సదస్సులు పెట్టడం కాదు.. ఉన్న పరిశ్రమలను కాపాడి.. తగిన ప్రోత్సహకాలు అందించి.. సక్రమంగా నడపాలంటూ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమలు, కార్మికుల ఉపాధి పరిరక్షణపై సీఐటీయూ ఆధ్వర్యంలో విజయనగరంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. విజయనగరం రెవిన్యూ భవనంలో జరిగిన ఈ సదస్సుకు.. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. నరసింగరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న 39 ఫెర్రో ఎల్లాయ్స్ కంపెనీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 30వేల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని.. అయితే., రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఈ పరిశ్రమల పరిస్థితి అగమ్యగోచరంగా మారి.. కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
ఫెర్రో పరిశ్రమల ఖర్చులో 50 శాతం విద్యుత్తు కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుందని.. గతంలో అయితే ఈ ఫ్యాక్టరీలకు తక్కువ ధరకే విద్యుత్తుని అందించారని తెలిపారు. ప్రస్తుతం ఇతర పరిశ్రమలకు యూనిట్‌కు 5రూపాయలు విధించగా., ఫెర్రోలపై యూనిట్‌కు 8.59రూపాయలు భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో., ఆ కంపెనీలపై 3వేల కోట్ల రూపాయాలు అదనపు భారం పడుతోందని విమర్శించారు. ఝార్ఖండ్‌లో ఫెర్రో పరిశ్రమలకు యూనిట్‌కి 4.50రూపాయలకే విద్యుత్తు సరఫరా చేస్తున్నారని స్పష్టం చేశారు.