విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో పలు కార్మిక సంఘాల ప్రతినిధులు, సభ్యులు ధర్నా చేపట్టారు. కేంద్రం తీసుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు... భాజపా నిర్ణయాన్ని ఖండించండి అంటూ నినదించారు. ఎన్టీఆర్ విగ్రహం కూడలి నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
కేంద్ర విధానాలే కారణం..
పరిశ్రమ నష్టాలకు కేంద్ర విధానాలే కారణమని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు నాగేశ్వరరావు ఆరోపించారు. కేంద్రానికి కర్మాగారం నుంచి రూ.42వేల కోట్ల ఆదాయం లభిస్తే...దాని అభివృద్ధికి కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. ప్లాంట్ విస్తరణకూ భాజపా ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇతర ఉక్కు పరిశ్రమలకు సొంత గనులు కేటాయించిన కేంద్రం..విశాఖ ఉక్కు పరిశ్రమకు ఎందుకు అలా కేటాయించలేదని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్రం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరిశ్రమ, దాని పరిరక్షణకు పోరాడుతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పల్లె పోరు: ఎంపీ భార్య.. వార్డు అభ్యర్థినిగా