విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని రెల్లివలసలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పసికందును తుప్పుల్లో పడేసిన ఘటన కలకలం రేపింది. గ్రామంలోని మహిళలు వేకువ జామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలోని పెద చెరువు వైపు వెళ్తున్న సమయంలో సమీప తుప్పల్లోంచి ఓ బిడ్డ ఏడుపు వినిపించింది. అటుగా వెళ్తున్న ఆర్. గౌరీ వెళ్లి చూడగా బొడ్డు తడి ఆరని మగబిడ్డ ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఆమె తన చేతుల్లోకి తీసుకొని వదిన వరుసైన రామాయ్యమ్మకు అప్పగించింది. తనకు పిల్లలు లేకపోవడంతో తాను పెంచుకుంటానని చెప్పి సంరక్షణ చర్యలు చేపట్టింది.
కన్నపేగు పారేసింది.. సమాజం చేరదీసింది - విజయనగరంలో తుప్పల్లో పడి ఉన్న బిడ్డ
కన్నపేగు తనను ఎందుకు వద్దనుకుందో ఆ పసికందుకు తెలీదు.. అక్కడ తుప్పల్లో ఎవరు పడేశారో కూడా తెలియదు. తన ఉనికిని ప్రపంచానికి తెలియజేయాలని చేసిన ఆర్తనాదం ఆటుగా వెళ్తున్న వారి చెవిన పడటంతో ప్రాణాలతో బయట పడింది. హృదయాలను ద్రవింపజేసే ఈ ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని రెల్లివలసలో చోటు చేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న గ్రామ వాలంటీర్లు మహిళా సంరక్షణ కార్యదర్శి జి.వెంకట అపర్ణకు తెలియజేశారు. ఆమె స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించగా... ఎస్‌ఐ బాలాజీరావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పసికందును స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గ్రామస్థులు పసికందును స్థానిక ఎస్‌ఐకి అప్పగించగా, ఆయన జిల్లా శిశు సంక్షేమ అభివృద్ది అధికారిణి లక్ష్మికి అప్పగించారు. తదుపరి సంరక్షణ నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఘోష ఆసుపత్రికి తరలించినట్లు ఆమె తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాలాజీరావు తెలిపారు.
ఇదీ చదవండి: పసికందును వదిలేశారు.. పాపను పోలీస్ స్టేషన్కు చేర్చిన మహిళ