Chandrababu Fire on YSRCP: రాష్ట్రానికి ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్మోహన్‌రెడ్డి చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతూ...రాష్ట్రాన్ని తగులబెడుతున్నారని మండిపడ్డారు. విజయనగరంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జగన్‌కు భయం పుట్టించేందుకు ఇంటికొక పసుపు జెండా ఎగరెయ్యాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రాన్ని దోచుకుంటున్న ముఖ్యమంత్రి జగన్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని తెలుగుదేశం శ్రేణులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయనగరంలో మూడో రోజూ "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భారీ రోడ్ షో నిర్వహించారు. కోట వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
నమ్మి ఓట్లేసిన ప్రజలకు జగన్ నమ్మకద్రోహం చేశారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని అసమర్ధ పాలనతో తగలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడున్నరేళ్లలో ఎక్కడా తట్ట మట్టి వెయ్యని జగన్.. బాదుడే బాదుడుతో ప్రజలను కోలుకోలేని దెబ్బతీశారని ఆక్షేపించారు.
వైసీపీ నాయకులకు విశాఖ కంటే అక్కడి ఆస్తులపైనే ప్రేమ ఎక్కువని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రుషికొండను బోడికొండ చేశారని మండిపడ్డారు. విశాఖలో జగన్ 40 వేల కోట్ల విలువైన భూములను కొట్టేశారని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వంలో 60 మంది సలహాదారులుంటే ఉత్తరాంధ్ర నుంచి ఒక్కరూ లేరన్నారు. టీటీడీ బోర్డులోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసి తప్పుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో నాటకాలు కట్టిపెట్టాలని హెచ్చరించారు.
నీతి నిజాయితీకి మారుపేరైన అశోక్ గజపతిరాజుపై అక్రమ కేసులు పెట్టించారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అక్రమ కేసులు పెట్టించిన వారిని వదిలిపెట్టబోనని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చాక రెట్టింపు సంక్షేమపథకాలు అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైకాపా తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్నారు.
పరిశ్రమలను తరిమేశారు..