ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కుటుంబాన్ని కుదిపేసిన క్యాన్సర్​... సాయం కోసం ఎదురుచూపులు

By

Published : Feb 16, 2022, 11:58 AM IST

Brain cancer: నిరుపేద కుటుంబం... రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి... తండ్రి దివ్యాంగుడు... తల్లి దినసరి కూలీ... అయినా పిల్లల చదువులుకు ఏ లోటు రాకుండా చూడాలనే ఆలోచన... అందుకే ఉన్నంతలో ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నారు... తమ పిల్లలు చదువుల్లో అద్భుతంగా రాణిస్తున్నారనే ఆనందనౌకలో ప్రయాణిస్తున్న ఆ దంపతులను అంతలోనే శోకాల సంద్రాన ముంచేసింది క్యాన్సర్​ మహమ్మారీ... వారి బిడ్డను ఆవహించి... బతుకంత బాధగా... కన్నీటి ధారగా అన్న పదాలను వారి జీవితాల్లో నింపేసింది... దాని బారి నుంచి తమ బిడ్డను కాపాడాలని దాతలను వేడుకుంటున్నారు తల్లిదండ్రులు...

Brain cancer
బ్రేయిన్​ క్యాన్సర్​తో అప్పలరాజు

Brain cancer: అంగవైకల్యంతో ఏ పనిచేయలేని పరిస్థితి తండ్రిది... రోజువారీ కూలీతో కుటుంబాన్ని పోషించాల్సిన దుస్థితి తల్లిది... కానీ ఉన్నంతలో బిడ్డలను చదివించుకుంటూ సవ్యంగా సాగుతున్న సమయంలో... పిడుగులాంటి వార్త వారిని కుదిపేసింది. కుమారుడికి బ్రెయిన్‌ క్యాన్సర్‌ సోకిందనే విషయం వారిని కలచివేసింది. తోటి పిల్లలతో కళాశాలకు వెళ్తున్న కుమారుడు అనారోగ్యంతో మంచాన పడటంతో కన్నీరు మున్నీరవుతున్నారు ఆ అభాగ్యులు..

బ్రేయిన్​ క్యాన్సర్​తో అప్పలరాజు

Brain cancer: విజయనగరం జిల్లా జామి మండలం అన్నంరాజుపేటకు చెందిన అంజూరి దుర్గ, లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. తండ్రి అంజూరి దుర్గ.... పోలియో కారణంగా పుట్టుకతోనే దివ్యాంగుడు. ఎలాంటి భారమైన పనులూ చేయలేరు. ఆయన భార్య లక్ష్మి.. రోజువారీ కూలీ చేస్తూ.. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. పిల్లలైనా బాగుపడాలని.. వారి చదువుకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలకు తగ్గట్లుగానే పిల్లలు విద్యలో ప్రతిభ కనబరుస్తున్నారు. కుమారుడు అప్పలరాజు.... 8వ తరగతిలో నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్‌నకు సైతం ఎంపికయ్యాడు. 10వ తరగతిలో 9.8 గ్రేడింగ్ సాధించి అబ్బురపరిచాడు. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని పట్టుదలతో కృషి చేస్తున్నాడు. అయితే... నిత్యం ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉండే అప్పలరాజుకు ఓ రోజు తీవ్ర తలనొప్పి రావడంతో... తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్థానిక వైద్యశాలలో నయం కాకపోగా..... మరిన్ని ఆరోగ్య సమస్యలు బయటపడ్డాయి. దీంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్రెయిన్ క్యాన్సర్ అని నిర్ధారించడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కుమారుడు ఉన్నపళలంగా మంచాన పడడంతో దిగులు చెందుతున్నారు. ఇంటికి పరామర్శకు వచ్చే వారితో చదువుకోవాలని ఉందని అప్పలరాజు అంటుంటే... వారు కన్నీరుమున్నీరవుతున్నారు..

Brain cancer: అప్పలరాజుకి కొన్ని రోజులుగా కంటిచూపు సైతం మందగించటం పట్ల తల్లిదండ్రులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. మరో మూడు నెలల్లో ఇంటర్ పూర్తవుతుందని ఆశిస్తున్న తరుణంలో ప్రాణాంతక జబ్బు రావటంపై అప్పలరాజు ఆవేదన చెందుతున్నాడు.

Brain cancer: జనవరి మొదటి వారంలో క్యాన్సర్‌కు గురైన అప్పలరాజుకి... ప్రస్తుతం విశాఖ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారానికి ఒక్కసారి అక్కడి వైద్యులు కిమోథెరఫీ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలు అందుతున్నప్పటికీ... రవాణా, మందులు, పౌష్టికాహారం ఇతరాత్ర ఖర్చులు ఆ నిరుపేద కుటుంబానికి భారంగా మారాయి. కుమారుడి వైద్యం కోసం తల్లిదండ్రులు ఇప్పటికే లక్ష రూపాయల వరకు అప్పు చేశామని ఆవేదన చెందుతున్నారు.

కుమారుడి వైద్యం కోసం దాతలు ఎవరైనా సాయం అందించి ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు..

ఇదీ చదవండి:వయసు 68... 6,800 కిలోమీటర్ల సైకిల్‌ యాత్రకు శ్రీకారం

ABOUT THE AUTHOR

...view details