ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసానికి నోటిసుల జారీ గురించి మాజీ మంత్రి యనమల చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ స్పందించారు. మంచి పరిపాలన కోసం చర్యలు తీసుకుంటుంటే... ప్రతిపక్షం ఆరోపణలు చేయడం తగదన్నారు. లూటీకి, అక్రమాలకు తావుండకూడదనే ఈ చర్యలు చేపట్టామన్న బొత్స... కరకట్టపై అక్రమ నిర్మాణాలు చేసిన ప్రతీ ఒక్కరికి నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఉంటున్న భవనం సీఆర్డీఏ పరిధిలో లేదని చెప్పడాని యనమల ఎవరని బొత్స ప్రశ్నించారు.
ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూపోతుందని... మాజీ సీఎం అయినా... సామాన్యుడైనా ప్రభుత్వానికి ఒక్కటేనని బొత్స పేర్కొన్నారు. విద్యుత్తు ఒప్పందాలపై నారా లోకేష్ ట్వీట్‌పై కూడా బొత్స స్పందించారు. విద్యుత్ ఒప్పందాల సమీక్షలో రాష్ట్రానికి నష్టం జరిగినట్లు గుర్తించామని... దానిపై విచారణ చేస్తామని చెప్పారు. లోకేష్, చంద్రబాబు కనుసన్నలలోనే విద్యుత్ ఒప్పందాలు జరిగాయన్న మంత్రి... ఏ మేరకు దోపిడి జరిగిందో వారికి తెలియని విషయమా అని ధ్వజమెత్తారు.