గెజిట్‌పై యనమల సమాధానం చెప్పాలి: మంత్రి బొత్స - amaravathi
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన విమర్శలపై మంత్రి బొత్స స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులపైనే విచారణ జరిపిస్తున్నామని, రాజధాని ప్రాంతం నుంచి ఓ ఆసుపత్రి తరలిపోవడానికి గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తానని విజయనగరంలో చెప్పారు.
గెజిట్ లేకుంటే అమరావతి నుంచి ఎందుకు పాలన చేస్తున్నారని యనమల చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స మండిపడ్డారు. అమరావతిపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారా? లేదా? అన్నది మాత్రమే తాను అడిగానని అన్నారు. గెజిట్ నోటిఫికేషన్ లేకుండా పరిపాలన చేశారో? లేదో అన్నది యనమల సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాలోనిగుర్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న బొత్స... అనంతరం మీడియాతో ముచ్చటించారు.చంద్రబాబు ప్రభుత్వం వ్యవస్థని చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నడపలేదని ధ్వజమెత్తారు. ప్రస్తుతం తాము వ్యవస్థను గాడిన పెట్టే పనిలో ఉన్నామని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక చాలా సంస్థలు వెళ్లిపోయాయన్న తెదేపా విమర్శలపైన ఆయన స్పందించారు. ఆ సంస్థల వివరాలు చెప్పాలని అన్నారు. అలాగే తెదేపా హయాంలో రాజధాని ప్రాంతం నుంచి ఓ ఆసుపత్రి తరలిపోవడానికి గల కారణాలను రేపు మీడియా సమావేశంలో వెల్లడిస్తామని మంత్రి పేర్కొన్నారు.