భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అరెస్టు..
చలో రామతీర్థం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. విశాఖ నుంచి రామతీర్థం వెళ్లే ముఖ్య నేతలను పోలీసులు వారి ఇళ్ల వద్దే అడ్డుకున్నారు. భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు సెక్షన్ 151 ప్రకారం నోటీసులు అందజేసి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధించారు. దీంతో ప్రభుత్వ చర్యల పై విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భాజపా, జనసేన నాయకులు గృహ నిర్భంధం..
చలో రామతీర్థం కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ జిల్లా నర్సీపట్నం భాజపా, జనసేన నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆయా పార్టీలకు చెందిన నాయకులను ఎక్కడికక్కడే నిర్బంధించారు. జనసేన పార్టీ నియోజకవర్గం నాయకులు కాళ్ల సూర్యచంద్రులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. నాతవరం మండలం చెర్లపాలెం లక్ష్మీపురం తదితర గ్రామాల్లో ఉన్న భాజపా, జనసేన నాయకులను గృహ నిర్బంధం చేశారు.
కార్యాలయంలోనే ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు..
విశాఖ భాజపా కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. 'చలో రామతీర్ధ' కార్యక్రమంలో పాల్గొనడానికి కార్యాలయానికి వచ్చిన ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు లను ఏసీపీ మూర్తి, పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయ గేట్ మూసి వేసి నేతలను కార్యాలయంలోనే నిలువరించారు. పోలీసుల తీరుపై సీఎం రమేష్, కామినేనిలు ఆగ్రహం వ్యక్తం చేశారు.