విజయనగరం జిల్లాలో నెలకొన్న సమస్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. నీటి సౌకర్యం లేక స్థానిక ప్రజలు వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో శక్తి కేంద్ర ప్రముఖ్ల సమావేశంలో మాట్లాడిన సోము వీర్రాజు.. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. జిల్లాలో అనేక ప్రాజెక్టుల పనులు పెండింగ్లో ఉన్నాయని దుయ్యబట్టారు.
పేదల ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీల రూపంలో నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొత్తం తమదేనంటూ గొప్పలు చెప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేపట్టిన గృహ నిర్మాణాలపై మంత్రి బొత్స, చంద్రబాబు.. ఒకే వేదికపైకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్న వామపక్షాలు.. స్థానిక సమస్యలపై ఎందుకు గొంతెత్తడం లేదని ప్రశ్నించారు.