Vizianagaram Biology Teacher : విద్యార్థులకు బట్టీ చదువులు నేర్పించకుండా ప్రతీ అంశానికి సంబంధించిన వాటిని ప్రదర్శిస్తూ పాఠాలు బోధిస్తోంది ఆ ఉపాధ్యాయురాలు. విజయనగరం జిల్లాలోని రేగిడి ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం బోధిస్తున్న ఉమామాహేశ్వరి అనే ఉపాధ్యాయురాలు విద్యార్థులకు వినూత్నంగా పాఠాలు బోధిస్తోంది. ఆమె చేస్తున్న వినూత్న బోధన, సామాజిక సేవా కార్యక్రమాలకు పలు జాతీయ స్థాయి అవార్ఢులు ఆమె సొంతమయ్యాయి.
రెండున్నర దశాబ్ధలుగా.. ఉపాధ్యాయ వృత్తిలో సేవలందిస్తున్న బూరవిల్లి ఉమామహేశ్వరి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. ఆమె భర్త కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతున్నారు. ఆమె తండ్రి త్రినాథరావు విశాఖపట్టణానికి డిప్యూటీ కలెక్టర్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. చిన్ననాటి నుంచి ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి ఉండటంతో.. 1998లో ఎస్జీటీగా ఉద్యోగం సాధించారు. అంతటితో సంతృప్తి చెందక 2001 సంవత్సరంలో డీఎస్సీ రాసి స్కూల్ అసిస్టెంట్‌గా విధులలో చేరారు.
రేగిడిలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా :గత ఐదు సంవత్సరాలుగా రేగిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో.. ఆమె జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె బోధించే పాఠాలు అంటే ఎంతో ఇష్టమని విద్యార్థులు అంటున్నారు. పుస్తకాలలో ఉన్న ప్రతి అంశాన్ని.. ప్రయోగాల రూపంలో చేసి చూపిస్తూ, నమూనాలతో వివరిస్తూ బోధించటం ఆమె ప్రత్యేకత. అంతేకాకుండా ఆమె పాఠశాల విద్యార్థుల కోసం రెండు సంవత్సరాల క్రితం.. "ఉమా సైన్స్ గురు" అనే యూ ట్యూబ్ ఛానల్‌ను ఆమె ప్రారంభించారు. ఇందులో పాఠశాల విద్యార్థులకు సంబంధించి సైన్స్ తరగతులను బోధిస్తోంది. పాఠ్యంశాలకు సంబంధించిన అంశాలే కాకుండా.. విజ్ఞానానికి సంబంధించిన వీడియోలను అందులో నిక్షిప్తం చేస్తున్నారు. అందుకే విద్యార్థులు ప్రేమగా.. ఆమెను ఉమా సైన్స్ గురు అని పిలుస్తున్నారు.
వైజ్ఞానిక ప్రదర్శన ఎక్కడైనా :విద్యార్థుల చేత ప్రేమగా పిలిపించుకుంటున్నా ఆ టీచర్ వైజ్ఞానిక ప్రదర్శనలు జరుగుతున్నాయని తెలిస్తే చాలు.. విద్యార్థులను ప్రొత్సహిస్తున్నారు. వారితోపాటు ఆమె వెళ్లి పలు వైజ్ఞానిక ప్రదర్శనలు, సెమినార్లు, పోస్టర్ ప్రజంటేషన్లను ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె సూచనల మేరకు రూపొదించిన ప్రాజెక్టులలో 5 జాతీయ స్థాయిలో, 15 రాష్ట్ర స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యాయి. అంతేకాకుండా వీవీఎం కౌశల్ పోస్టర్ ప్రజంటేషన్లో 2020, 2021 సంవత్సరాలలో జిల్లా స్థాయి ప్రథమ, 2019లో ద్వితీయ స్థానాలకు రేగడి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు.