భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం 2,700 ఎకరాల భూములు సేకరించింది. అలాగే నాలుగు గ్రామాలను తరలించాలని నిర్ణయించింది. ఈమేరకు బొలింకలపాలెం, రెల్లిపేట, మూడసర్లపేట గ్రామాలకు చెందిన వారికి గూడెపువలసలో నిర్వాసితుల కాలనీకి 17 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ నిర్మాణాలు బాగానే జరుగుతున్నాయి. కానీ మరడపాలెంకు చెందిన 223 కుటుంబాలకు... పోలిపల్లి రెవెన్యూలోని లింగాలవలస వద్ద 25 ఎకరాల్లో ఇంటి స్థలాలు ఇచ్చారు. ఇవి కొండకు అనుకొని ఎత్తయిన ప్రాంతంలో ఉండటంతో నిర్మాణానికి అనువుగా లేవు. నిర్వాసితుల కాలనీలో పనులు మొదలుపెట్టిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
బాంబులు పెట్టి పేల్చాల్సిన పరిస్థితి..
ఒక్కో కుటుంబానికి రూ. 9. 36 లక్షల సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంటి పనులు ప్రారంభిస్తే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని అధికారులు తెలిపారు. వందల మంది నిర్మాణానికి ముందుకొచ్చి... చాలా వరకు ఇళ్ల పనులను గుత్తకు ఇచ్చారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 15 లక్షల నుంచి 17 లక్షల వరకు తీసుకుంటున్నారు. కానీ భూమి లోపల పెద్దపెద్ద బండలు ఉండటంతో పనులు ముందుకు సాగడం లేదు. వీటిని బాంబులు పెట్టి పేల్చాల్సి వస్తోంది. ఇందుకోసం అదనంగా వేలాది రూపాయలు ఖర్చుచేయక తప్పడం లేదు.