విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయ పనులను జీఎంఆర్ సంస్థకే ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ విమానాశ్రయంపై చర్చించిన తర్వాత.. నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భోగాపురం, నెల్లూరు జిల్లాలోని దగదర్తి విమానాశ్రయాల నిర్మాణ పనులు దక్కించుకున్న గుత్తేదారు సంస్థలు జీఎంఆర్, టర్బోలతో రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏపీఏడీసీఎల్) సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి వచ్చే మూడు నెలల్లో సేవలు ప్రారంభించాలని ఏపీఏడీసీఎల్ భావిస్తోంది. ఇందుకు అవసరమైన అనుమతుల కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కు దరఖాస్తు చేసింది. ఓర్వకల్లు విమానాశ్రయ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) టవర్ నిర్మాణం తుది దశలో ఉంది. ఉడాన్ పథకంలో భాగంగా ప్రాంతీయ అనుసంధానం కింద... కర్నూలు నుంచి బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాలకు సర్వీసులు నడిపేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. స్పైస్‌జెట్, జెట్ ఎయిర్ వేస్ సంస్థలు ఈ సేవలు అందించటానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి.
భోగాపురంపై ప్రత్యేక దృష్టి
భోగాపురం విమానాశ్రయానికి గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. మొదటి విడత పనులకు 2,624 ఎకరాల భూముల అవసరమైతే, ఇప్పటికే 2,400 ఎకరాలను సేకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించింది. దీని వల్ల భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. గత కేబినెట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందంపై పునఃపరిశీలన చేయాలని ఏడీసీఎల్‌ను ఆదేశించింది. ప్రభుత్వ సూచన మేరకు.. ప్రభుత్వ వాటాతో పాటు, మరికొన్ని కీలక అంశాలపై జీఎంఆర్‌తో ఇటీవల చర్చలు జరిగాయి. ఇవి కొలిక్కి రావటంతో వచ్చే కేబినెట్ సమావేశంలో భోగాపురంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఒక అధికారి తెలిపారు.