సీతానగరం పోలీస్ ఠాణా...ఫ్రెండ్లీ పోలిసింగ్కు ఉదాహరణ విజయనగరం జిల్లాలోని సీతానగరం పోలీస్ స్టేషన్ ప్రజా సేవలో ప్రత్యేక స్థానాన్ని సాధించుకుంటోంది. ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళితే ఫిర్యాదు చేసేందుకే గంటల తరబడి వేచి చూడాల్సి ఉంటుంది. ఇటువంటి వారికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సీతానగరంలోని పోలీస్ స్టేషన్లో ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేశారు. నిర్భయంగా సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఫిర్యాదు దారులు కోసం కౌన్సిలింగ్ హాలును ఏర్పాటు చేశారు. స్టేషన్ మొత్తాన్ని మొక్కలు నాటి పచ్చదనంతో నింపేశారు.
ఎంపిక చేశారిలా...
దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల పనితీరుని కేంద్ర హోంశాఖ ప్రతినిధుల బృందం 2018లో పరిశీలించింది. ఇందులో భాగంగా దేశంలో పది పోలీసు స్టేషన్లను ఉత్తమ పోలీసు స్టేషన్ గా ఎంపిక చేయగా మన రాష్ట్రం నుంచి సీతానగరం పోలీసుస్టేషన్ ఉండటం విశేషం. ఠాణాల నిర్వహణపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసేందుకు 2018లో అధికారుల బృందం సీతానగరం స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసింది. పోలీసు స్టేషన్లో గదులు, దస్త్రాలు, మరుగుదొడ్లు, లాకప్ గదులు, పరిసరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. సీతానగరం పోలీసు స్టేషన్ లో పనిచేసిన అప్పటి ఎస్ఐ పనితీరుతో పాటు వారి సిబ్బంది పనితీరు, ప్రజలతో నెలకొన్న సత్సంబంధాలు, పరిశుభ్రత, రోడ్ల ప్రమాదాల నివారణ, రికార్డుల సక్రమ నిర్వహణ, కేసుల పరిష్కారం విధానాలను పరిశీలించిన కేంద్ర బృందం జిల్లా నుంచి సీతానగరం ఠాణాను సిఫార్సు చేసింది.
అన్ని విభాగాల్లోనూ ఇతర ఠాణాల కంటే మెరుగ్గా ఉన్నందున 2018 సంవత్సరానికి దేశంలో ఉత్తమమైన పదింటిలో ఒకటిగా సీతానగరం స్టేషన్ గుర్తింపు లభించింది.కేంద్ర హోంశాఖ అందించిన పురస్కారం స్ఫూర్తితో భవిషత్తులో సీతానగరం ఠాణాను మరింత ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని., అధికారులు, సిబ్బంది చెబుతున్నారు.