ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకం లబ్ధిదారుల ఆందోళన - bas scheme beneficiaries news

ఎస్సీ, ఎస్టీ వర్గాల పేద విద్యార్థులను కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదివించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌(బీఏఎస్‌) పథకం లబ్ధిదారుల పరిస్థితి అయోమయంగా మారింది. గత రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి నిధుల విడుదల నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో 'బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌' పథకం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకం లబ్ధిదారుల ఆందోళన
బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకం లబ్ధిదారుల ఆందోళన

By

Published : Jun 24, 2020, 7:40 PM IST

విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్యను అందించేందుకు కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 'బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌(బీఏఎస్‌) పథకాన్ని అమలు చేశారు. ఈ మేరకు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్ధులకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించారు. ప్రస్తుతం ఈ పథకం లబ్ధిదారుల పరిస్థితి అయోమయంగా మారింది. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదల నిలిచిపోయింది. బిల్లులు అందకపోవటంతో, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యజమాన్యాలు పిల్లలను కొనసాగించేందుకు ససేమీరా అంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే సగం మంది విద్యార్థులను ఇళ్లకు పంపారు. మరో నెలరోజుల్లో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నప్పటికీ, 'బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌' పథకం బకాయిల చెల్లింపుపై స్పష్ఠత కొరవడింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో 'బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌' పథకం విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది.

ఆర్థికంగా వెనుకబడిన షెడ్యూల్డు కులాల విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బీఏఎస్​, కార్పొరేట్ కళాశాల అనే పథకం ప్రవేశపెట్టింది. 2008 నుంచి సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాలు అమలవుతున్నాయి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కార్యక్రమంలో భాగంగా కింద 1వ తరగతి, 5వ తరగతిలో ఎంపిక చేసిన ఉత్తమ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో షెడ్యూల్డు తరగతుల విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. ‍ఒకటో తరగతికి లాటరీ ద్వారా, ఐదో తరగతకి రాత పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ పథకం అర్హతగా తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.65 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేల లోపు ఉండాలి. ఈ పథకం కింద రెసిడెన్షియల్ విద్యార్థులకు ఏడాదికి రూ.30వేలు, నాన్ రెసిడెన్షియల్ విద్యార్థులకు రూ.20 వేలు చొప్పున మంజూరు చేస్తున్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లాలో ఏటా ఒకటో తరగతికి 200 మంది, 5వ తరగతికి 250 సీట్లు కార్పొరేట్ పాఠశాలల్లో కేటాయించారు.

  • నిలిచిన బిల్లులు

జిల్లాలో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకం 12 రెసిడెన్షియల్, 14 నాన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అమలు జరుగుతోంది. 2015-16 నుంచి 2018-19 విద్యా సంవత్సరం వరకు ఈ పథకం ద్వారా జిల్లాలో రెసిడెన్షియల్ 1220 మంది, నాన్ రెసిడెన్షియల్ 717 మంది విద్యార్థులు లబ్ధిపొందారు. కార్పొరేట్ పాఠశాలలు విధిగా 25శాతం సీట్లు కేటాయింపు, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం, రుసుముల చెల్లింపులకు ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేశాయి. పట్టణాలలో ఒకే ప్రాంతంలో ఎక్కువ పాఠశాలలను గ్రూపులుగా విభజించి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. అయితే గత రెండేళ్లుగా ఈ పథకం ద్వారా సంబంధిత పాఠశాలలకు అందాల్సిన బిల్లులు నిలిచిపోయాయి. ఇందులో భాగంగా జిల్లాలో సుమారు రూ.6 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా ఆయా పాఠశాలల నుంచి పిల్లలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

  • విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్న యాజమాన్యాలు

విద్యాహక్కు చట్టం ప్రకారం 14ఏళ్ల వరకు పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలి. ప్రైవేటు పాఠశాలల్లో కూడా 25శాతం సీట్లు పేదవారికి కేటాయించాలని ఈ చట్టంలోని సెక్షన్ 12(1)(సీ) చెబుతోంది. ఈ విద్యార్థుల రుసుములను ప్రభుత్వమే ఆ ప్రైవేటు పాఠశాలలకు చెల్లిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సరాసరిన ఒక విద్యార్ధికి ఎంత ఖర్చు చేస్తారో ఆ మొత్తం లేదా ప్రైవేటు పాఠశాల రుసుము. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ప్రభుత్వం పాఠశాలకు చెల్లిస్తుంది. ఈ 25 శాతం కోటాలో చేరే విద్యార్థుల నుంచి ఎలాంటి డొనేషన్లు వసూలు చేయకూడదు. ఏ కారణంతోనూ పాఠశాల నుంచి విద్యార్థులను బయటకు పంపకూడదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2018-19, 2019-20 విద్యా సంవత్సరం బకాయిలు విడుదల చేయకపోవటంతో ప్రైవేటు పాఠశాలలకు భారంగా మారింది. ప్రధానంగా రెసిడెన్షియల్ పాఠశాలల యాజమాన్యాలు ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో 'బెస్ట్ అవెలబుల్ స్కూల్స్' పథకం విద్యార్ధులపై ఒత్తిడి చేస్తున్నారు. కొందరు ఇప్పటికే విద్యార్థులను ఇళ్లకు పంపించారు.

  • బీఏఎస్​ పథకం కొనసాగించాలి

బీఏఎస్​ పథకం బకాయిల విడుదలపై స్పష్టత కొరవడటం, పాఠశాలల యాజమాన్యాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సంబంధిత కార్యాలయాలు, అధికారులు చుట్టూ తిరిగి విసిగిపోయిన వారు ధర్నాలకు దిగుతున్నారు. ఈ పథకానికి నిధులు విడుదల చేయకపోవటంతో కార్పొరేట్ పాఠశాలలో ఉచిత విద్య పొందుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. అమ్మఒడి పథకం నెపంతో రాష్ట్ర ప్రభుత్వం 2008 నుంచి అమల్లో ఉన్న బీఏఎస్​ పథకాన్ని నిలిపివేయటం సమంజసం కాదంటున్నారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలకు వరంగా ఉన్న ఈ పథకాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

  • పథకంపై ఎలాంటి సమాచారం లేదు

బీఏఎస్​ పథకం బకాయిలు, కొనసాగింపుపై అధికారులను వివరణ కోరగా.. పథకం కొనసాగింపు, రద్దుపై ఎలాంటి సమాచారం లేదని విజయనగరం జిల్లా సాంఘీక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ సునిల్ రాజకుమార్ పేర్కొన్నారు. బకాయిల విషయం ప్రభుత్వ దృష్టిలో ఉందన్నారు. సమస్య తీవ్రతను రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. బకాయిల విడుదలకు చర్యలు ప్రారంభమైనట్లు తెలిసిందన్నారు.

విద్యాహక్కు చట్టంలో అమల్లో భాగంగా ప్రవేశపెట్టిన "బెస్ట్ అవెలబుల్ స్కూల్స్" పథకం లబ్ధిదారుల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో బకాయిలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. విద్యాసంవత్సరం ప్రారంభంలోపు తగు చర్యలు తీసుకుని బకాయిలు విడదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఇదీ చూడండి:ఆన్​లైన్​ యోగాపోటీల్లో గెలుపొందిన బాలుడికి సత్కారం

ABOUT THE AUTHOR

...view details