Beauty of Vizianagaram: విజయనగరం కొత్త సొబగులను సొంతం చేసుకుంటోంది. ప్రముఖుల విగ్రహాలతో పాటు విద్యుత్తు కాంతుల మధ్య ముఖ్య కూడళ్లు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. గతానికి భిన్నంగా ఎటు చూసినా కొత్త అందాలతో నగరం శోభాయమానంగా శోభిల్లుతోంది. పండగ వస్తే.. గాని అలంకరణ దీపాలు అమర్చలేని పరిస్థితి నుంచి అనునిత్యం రంగురంగుల విద్యుత్ కాంతులతో మెరిసిపోతూ ప్రజలను మురిపిస్తోంది విజయనగరం.
నగరం ప్రవేశ ముఖ ద్వారాల్లో నాలుగు వైపుల విద్యల నగరం, మన విజయనగరం, సాంస్కృతిక నగరం పేరుతో చిహ్నాలను ఏర్పాటు చేసి.. ఆ ప్రాంతాలను విద్యుత్తు దీపాల అలంకరణ, వాటర్ ఫౌంటెన్‌తో సుందరంగా తీర్చిదిద్దారు. ఇక శిథిలావస్థకు చేరిన నగరానికి చారిత్రాత్మక చిహ్నమైన గంటస్తంభాన్ని అత్యంత అందంగా ఆధునీకరించారు. స్తంభం మొత్తం విద్యుత్తు కాంతులతో తీర్చిదిద్దటంతో పాటు.. స్తంభం ముందు భాగంలో విద్యుత్తు వెలుగులు, వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు.
ఇక నగరంలోని ప్రధాన కూడళ్లను ప్రముఖ దేశ నాయకులు, స్వాంతంత్య్ర సమరయోధుల విగ్రహాలను నెలకొల్పి.. వాటి పరిసరాలను ఆకర్షణీయంగా అలంకరించారు. నగరంలోని ప్రధాన ముఖద్వారమైన సంతకాల వంతెన కూడలిలో రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేయటంతో పాటు.. అందరినీ ఆకర్షించే విధంగా వివిధ రకాల చేపల ఆక్వేరియమూ ఏర్పాటు చేశారు. అలాగే మన విజయనగరం పేరిట జలపాతాన్ని తలపించే విధంగా వాటర్ ఫౌంటెన్ నెలకొల్పారు.
ఇక పాలకొండ-విజయనగరం రోడ్డుకు స్వాగతం పలికే కూడలి వద్ద మినీ జలపాతాన్ని ఏర్పాటు చేశారు. అలాగే కొత్తపేట కూడలిలో రాధాకృష్ణుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి. ఆహ్లాదకర వాతావరణాన్ని తీర్చిదిద్దారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని రింగ్ రోడ్డు రైతు బజారు వద్ద ఏర్పాటు చేసి.. ఆ ప్రాంతమంతా సుందరంగా తీర్చిదిద్దారు. కలెక్టరేట్ వద్ద ఎన్టీఆర్ కూడలిని అందంగా మలిచారు. ఇదే ప్రాంతంలో ఉన్న జ్యోతిరావు ఫూలే, సావిత్రబాయి ఫూలే విగ్రహాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ ఏర్పాట్లతో ప్రధాన కూడళ్లు రాత్రివేళ్లలో విద్యుత్తు వెలుగులు, వాటర్ ఫౌంటెన్‌తో అత్యంత ఆకర్షణీయంగా మారాయి.