BALA SADAN CHILDRENS FOOD POISONING : ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ (ఐసీడీఎస్) ఆధ్వర్యంలో విజయనగరంలోని పాల్ నగర్ సమీపంలో నడుస్తున్న బాల సదనంలో శుక్రవారం రాత్రి కలుషిత ఆహారం తిని 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ 12 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి కోడి గుడ్డు కూరతో పిల్లలకు అన్నం పెట్టారు. ఇది సహించక పోవడంతో వారు తినేందుకు అయిష్టత చూపారు. సిబ్బంది బలవంతం చేయడంతో ఆహారం తిన్న పిల్లలందరికీ కడుపు నొప్పితో పాటు, వాంతులు అయ్యాయి. విషయం తెలుసుకున్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కేసలి అప్పారావు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ (ఐసీడీఎస్) పీడీ శాంతి కుమారి వసతి గృహానికి చేరుకున్నారు. ఘటనపై ఆరా తీశారు. వారి విచారణలో తమ ఇబ్బందులను పిల్లలు ఏకరువు పెట్టారు.
తిడుతూ కొడుతున్నారు.. మరుగు దొడ్లను కడిగిస్తున్నారు :బాల సదనంలో సిబ్బంది తమను పట్టించుకోవడం లేదని, తిండి కూడా సక్రమంగా పెట్టడం లేదని చిన్నారులు వాపోయారు. ఇష్టానుసారం తిడుతూ కొడుతున్నారని, తమ తల్లిదండ్రులనూ దూషిస్తున్నారని రోదిస్తూ చెప్పారు. బాల సదనంలో పనులన్నీ తమతోనే చేయిస్తున్నారని, చివరకు మరుగు దొడ్లను కూడా కడిగిస్తున్నారని వాపోయారు. బాల సదనానికి ఏఎన్ ఎం, వైద్యురాలు చేరుకుని పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అనంతరం చైర్మన్ కేసలి అప్పారావు ఆదేశాల మేరకు వారిని మెరుగైన వైద్యం కోసం సర్వజన ఆసుపత్రికి తరలించారు.