ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కొవిడ్ బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అభినందించారు. ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి, మరిన్ని సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరారు. సుమారు రూ.15 లక్షలు విలువైన 12 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 2500 శానిటైజర్ (200 మి.లీ) బాటిళ్లను పైడిభీమవరానికి చెందిన అరబిందో ఫార్మా ఫౌండేషన్... జిల్లా కలెక్టర్‌కు కలెక్టరేట్‌వద్ద అందజేసింది.
ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ.... ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అవసరం చాలా ఉందన్నారు. ఒక్కొక్కటి సుమారు రూ.80వేలు విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అరబిందో ఫార్మా ఫౌండేషన్ అందజేసిందని, వాటిని ఎస్‌కోట, పార్వతీపురం తదితర అవసరమైన ఆసుపత్రులకు పంపిస్తామని తెలిపారు. కరోనా కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాగం పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేస్తోందని, దీనిలో భాగంగా గ్రామ, వార్డు కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.