మాన్సాస్ ట్రస్ట్‌లో జమాబందీ లెక్కల వివరాలు తేల్చేందుకు.. విజయనగరంలోని ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో ఆడిట్ శాఖ జిల్లా అధికారులు దస్త్రాలు పరిశీలించారు. 2004 నుంచి ప్రతి ఏడాది ఆడిటింగ్ కోసం మాన్సాస్ ట్రస్ట్‌కు నోటీసులు ఇస్తున్నా.. ప్రక్రియ జరగలేదని జిల్లా ఆడిటింగ్ అధికారి హిమబిందు తెలిపారు. ట్రస్టు వ్యవహారాలు వివాదాస్పదంగా మారటంతో ఈ తనిఖీలు చేశామని చెప్పారు.
ట్రస్టు ఆధ్వర్యంలోని దేవాలయాలు, విద్యాసంస్థలకు సంబధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉందని, సంబంధిత రికార్డులను అందజేయాలంటూ నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు. ఆడిటింగ్ పూర్తయ్యాక ఫీజు వసూలు చేస్తామన్నారు. ఆడిటింగ్ కోసం ఏటా రుసుము చెల్లించినట్లు మాన్సాస్ ట్రస్ట్ యాజమాన్యం చెబుతోందని, అసలు ఫీజు కట్టారో లేదో అనేది రికార్డులు పరిశీలించిన తర్వాతే చెబుతామని అన్నారు.