విజయనగరం జిల్లా కందిరివలస గ్రామంలో వార్డు వాలంటీర్ ను స్థానికులు దాడి చేసి హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కోన లక్ష్మణరావు(25) వాలంటీర్ గా పని చేసేవారు. విధుల్లో భాగంగా.. గ్రామంలోని ప్రజలకు కోవిడ్-19 ప్రభావంపై అవగాహన కల్పించేవారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన చిన్నారావ్, అతని తండ్రి సన్యాసి.. ఇద్దరూ లక్ష్మణరావుతో గొడవపడ్డారు.
స్థానికులు సర్ది చెప్పగా.. వివాదం సద్దమణిగింది. అక్కడితో ఆగని చిన్నారావు, అతని కుటుంబీకులు.. ఈ నెల 20న అదును చూసి లక్ష్మణరావుపై దాడి చేశారు. గుండెపై బలమైన గాయం తగిలిన అతడిని సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడి నుంచి విశాఖకు తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మణరావు చనిపోయారు. కేసు దర్యాప్తులో ఉంది.