నాగరికతకు దూరంగా ఉండే ఆదివాసీలను చైతన్యం చేసే లక్ష్యంతో.... శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పెద్దపేట కేంద్రంగా 1989లో 'యాక్షన్ ఇన్ రూరల్ టెక్నాలజీ అండ్ సర్వీస్' పేరిట ఆర్ట్స్ సంస్థ ఏర్పాటైంది. శ్రీకాకుళం జిల్లాలో నాలుగు మండలాల్లో సేవలదించిన సంస్థ... విజయనగరం జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాలకు విస్తరించింది. అక్కడి గిరిజనానికి చదువు విలువ నేర్పింది. ఆదివాసీలకు భూమి, అడవి హక్కులు లభించేలా కృషి చేసింది.
పట్టాలు ఇప్పించి.... సాగు వైపు నడిపించి
ఆదివాసీలకు భూమి, అటవీ హక్కులు లభించేలా ఆర్ట్స్ సంస్థ కృషి చేసింది. హక్కులు, చట్టాలపై యువతకు అవగాహన కల్పించింది. నాబార్డు సాయంతో 28 గ్రామాల్లో రైతుసంఘాలు ఏర్పాటు చేసి... వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. 'ఆర్ట్స్' సంస్థ తోడ్పాటుతో గూడేల్లో వసతులు సమకూరాయని, బంజరు భూముల్ని సాగు భూములుగా మార్చి... ఉపాధి పొందుతున్నామని గిరిజనులు సంతోషంగా చెబుతున్నారు.