ప్రపంచాన్ని గజగజవణిస్తున్న మహమ్మారి కరోనా... మనవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రపంచంలో 170 కోట్ల మంది ఇళ్లకే పరిమితం అయ్యారంటే పరిస్థితి ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా వ్యాప్తి దృష్ట్యా దేశం మొత్తం లాక్డౌన్ అయ్యింది. ఇలాంటి సమయంలోనూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కొంత మంది పట్టణ వాసులు. ఆంక్షలు ఉన్నా, పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నా.. ఏం కాదులే అన్న నిర్లక్ష్య ధోరణితో రోడ్డెక్కెస్తున్నారు. పల్లెవాసులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 'మా గ్రామంలోకి రావద్దు' అంటూ బోర్డులు పెడుతున్నారు. గ్రామస్తులను సైతం ఊరు దాటి పోనివ్వటంలేదు. కరోనా వ్యాప్తి నివారణలో ఇలాంటి పల్లెలే పట్టణాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
విజయనగరం జిల్లాలో...
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జియ్యమ్మవలస, కురుపాం మండలాల్లో పలు గ్రామాల్లో ప్రజలే 'విలేజ్ లాక్డౌన్' ప్రకటించారు. ఎవరైనా గ్రామం నుంచి బయటకు వెళ్లినా, బయట నుంచి ఎవరైనా వచ్చినా జరిమానా విధిస్తున్నారు. చెక్ పోస్టులు పెడుతూ స్వీయ నియంత్రణ పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గిరిజన గ్రామాల్లో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలోని ఎస్ కోట మండలంలోని లచ్చందొరపాలెం, మరుపల్లి, ఒడ్డు మరుపల్లి గిరిజనవాసులు తమ గ్రామాల్లోకి ఎవరు రాకుండా కంచెలు వేశారు.
విశాఖ జిల్లాలో..
కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో విశాఖ జిల్లా అనకాపల్లిలోని శ్రీనివాసనగర్ కాలనీవాసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరూ ఇళ్లనుంచి బయటకిరావద్దని కోరుతున్నారు. అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామస్తులు సైతం చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకుని స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు.