ఆంధ్రప్రదేశ్ - ఒడిశా మధ్య ఉన్న 36వ నంబరు రాష్ట్ర రహదారి... సమస్యలకు నిలయంగా మారింది. ఈ మార్గం... శ్రీకాకుళంజిల్లా చిలకపాలెం నుంచి ఒడిశా సరిహద్దులోని విజయనగరంజిల్లా కూనేరు వరకు విస్తరించి ఉంది. ఏపీ నుంచి ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్, రాయఘడ్, రాయపుర్, భవనిపట్నంతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ఈ రహదారే ప్రధాన మార్గం. రోజూ సుమారు 4వేల వరకు భారీ వాహనాలు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తాయి.
గతుకుల మార్గం... డ్రైవర్లకు చూపిస్తోంది నరకం!
మోకాళ్ల లోతు గోతులు.. తరచూ ప్రమాదాలు, నిత్యం ట్రాఫిక్ జాం. ఇదీ... ఆంధ్రప్రదేశ్ - ఒడిశా రాష్ట్రాల సరిహద్దు రహదారిలో దుస్థితి. ఏపీ నుంచి ఒడిశా, చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరుకు రవాణాకు ఇదే ప్రధాన దారి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ రాష్ట్ర రహదారిని ప్రస్తుతం పట్టించుకునే వారే లేకపోవటం... వాహనచోదకులకు శాపంగా మారింది.
నిత్యం రద్దీగా ఉండే 36వ నంబర్ రాష్ట్ర రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని మూడేళ్ల క్రితం ప్రతిపాదించారు. ముఖ్యంగా శ్రీకాకుంజిల్లా చిలకపాలెం నుంచి కూనేరు వరకు 126 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ చేపట్టేందుకు కార్యచరణ రూపొందించారు. ఈ మేరకు సర్వే సైతం పూర్తి చేశారు. అయితే విస్తరణ పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. రహదారిపై చిన్నపాటి మరమ్మతులు చేపట్టలేదు. ఫలితంగా.. ఆంధ్ర - ఒడిశా సరిహద్దు రాష్ట్ర రహదారి గోతులమయంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణం ప్రాణసంకటంగా మారిందని వాహన చోదకులు వాపోతున్నారు.
వాహనాలు ఎక్కడపడితే అక్కడ మరమ్మతులకు గురి కావడం ఈ గతుకుల రహదారిపై మామూలు విషయం. రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ నిచిపోతుంటుంది. ఈ సమస్యల దృష్ట్యా... రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని వాహన చోదకులతో పాటు., స్థానికులు కోరుతున్నారు. కనీస మరమ్మతులైనా చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.