AP Inter Results : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల విడుదల సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన ఇది..అయితే మంత్రి వ్యాఖ్యలకు..క్షేత్రస్థాయిలో వచ్చిన ఫలితాలకు ఎక్కడా పొంతన లేదు. ప్రైవేట్ రెసిడెన్షియల్ కళాశాలల కన్నా ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలల్లోనే ఫలితాలు బాగున్నాయని బొత్స సత్యనారాయణ చెప్పారు. కానీ రాష్ట్రంలో 34 కేజీబీవీల్లో సున్నా ఫలితాలు వచ్చాయి. విద్యాశాఖ మంత్రి సొంత జిల్లా విజయనగరంలోని మూడు కేజీబీవీలో ఒక్కొక్కరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అయినా సరే మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం డాంభీకాలు పోయారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు, కేజీబీవీల డొల్లతనం బయటపడింది. మండలానికో మహిళా జూనియర్ కళాశాల ఉండాలంటూ సీఎం జగన్ ఆదేశించడమే తరువాయి ముందూ వెనక ఆలోచించకుండా.. 292 హైస్కూల్ ప్లస్‌లు,131 కేజీబీవీలో ఇంటర్మీడియట్ కోర్సులు అధికారులు ప్రారంభించారు. కనీసం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సైతం ఇవ్వలేదు. హైస్కూల్ ప్లస్‌లో పాఠాలు చెప్పేందుకు లెక్చరర్లను నియమించకుండా అక్కడే ఉన్న ఉపాధ్యాయులతో మమా అనిపించేశారు.
దీంతో దాదాపు 50శాతం పైగా హైస్కూల్ ప్లస్‌లో ఫలితాలు శూన్యం. 131 కేజీబీవీలకుగాను 30 కేజీబీవీల్లో ఒక్కరు కూడా పాసవ్వలేదు. మరో మూడింటిలో రెండో ఏడాదిలో సున్నా ఫలితాలు వచ్చాయి. ఒక్క కర్నూలు జిల్లాలోనే 7 కేజీబీవీల్లో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేదు. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా అయిన విజయనగరంలో 3 కేజీబీవీల్లో 64మంది పరీక్షలకు హాజరు కాగా ఒక్కొక్కరు చొప్పున పాసయ్యారు. ఉమ్మడి విజయనగరం కేజీబీవీల నుంచి 717మంది పరీక్షలు రాస్తే 48 శాతం మంది పాస్ కాగా.. శ్రీకాకుళం జిల్లాలో 704మంది పరీక్షలు రాస్తే 54.26శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు.