రాష్ట్రంలో గిరిజన సంక్షేమానికి తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ తొలి ఏడాదిలోనే నెరవేర్చామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి వెల్లడించారు. విజయనగరం జిల్లా కురుపాం మండలంలో నేరేడువలస నుంచి తిక్కబాయికి వెళ్లే కొత్తరోడ్డు నిర్మాణాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె వెంట వైకాపా అరకు పార్లమెంటరీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజుతో పాటుగా ఇతర అధికారులు ఉన్నారు. ట్రైబల్ సబ్‌ప్లాన్‌లో భాగంగా రూ.3,726 కోట్లతో గిరిజన అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. దీనికి అదనంగా రూ.1,232 కోట్లతో రహదారుల నిర్మాణాలను మంజూరు చేశామని అన్నారు.
ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో 4 లక్షల 76 వేల 206 గిరిజన కుటుంబాలకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నామని పుష్పశ్రీవాణి తెలిపారు. 2019 - 20 ఆర్థిక సంవత్సరంలో గిరిజనాభివృద్ధి కోసం 48 ప్రభుత్వ శాఖల ద్వారా రూ.4,988 కోట్లను మంజూరు చేసినట్లు వివరించారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 18.40 లక్షల మంది గిరిజనులకు ప్రయోజనాన్ని చేకూర్చగలిగామని అన్నారు.